ఆమోసు
ఉపోద్ఘాతం
1
1 ఇది ఆమోసు వర్తమానం. ఆమోసు తెకోవ నగరానికి చెందిన ఒక గొర్రెల కాపరి. ఉజ్జీయా యూదాకు రాజుగాను, యెహోయాషు కుమారుడు యరొబము ఇశ్రాయేలుకు రాజుగాను ఉన్న కాలంలో ఆమోసు ఇశ్రాయేలును గూర్చి దర్శనాలు చూశాడు. ఇది భూకంపం రావటానికి రెండు సంవత్సరాల ముందటి విషయం.
సిరియాకు శిక్ష
2 ఆమోసు ఇలా అన్నాడు:
“యెహోవా సీయోనులో సింహంలా గర్జిస్తాడు.
ఆయన గంబీరస్వరం యెరూషలేము నుండి గర్జిస్తుంది.
గొర్రెల కాపరుల పచ్చిక బయళ్లు ఎండి పోతాయి.
కర్మెలు పర్వతం* సహితం ఎండి పోతుంది.”
3 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “దమస్కు† ప్రజలు చేసిన అనేక నేరాలకు నేనువారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే వారు గిలాదును‡ ధాన్యం రాలగొట్టే ఇనుప కడ్డీలతో నలుగగొట్టారు.
4 కావున హజాయేలు§ ఇంటిలో (సిరియా) నేను అగ్నిని పుట్టిస్తాను. ఆ అగ్ని బెన్హదదు** ఉన్నత బురుజులను నాశనం చేస్తుంది.
5 “దమస్కు ద్వారాల మీద ఉన్న బలమైన కడ్డీలను విరుగగొడతాను ఆవెను లోయలో సీంహాసనంపై కూర్చున్నవానిని నేను నాశనం చేస్తాను. బెతేదేనులో రాజదండం పట్టిన రాజును నేను నాశనం చేస్తాను. సిరియా ప్రజలు ఓడింపబడతారు ప్రజలు వారిని కీరు దేశానికి తీసుకుపోతారు.” యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
ఫిలిష్తియులకు శిక్ష
6 యెహోవా ఇది చెపుతున్నాడు: “గాజా†† ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే వారు ఒక దేశ ప్రజలందరినీ చెరబట్టి, వారినిఎదోముకు‡‡ బానిసులుగా పంపారు.
7 కావున గాజా ప్రాకారం మీదికి నేను అగ్నిని పంపుతాను. గాజాలోని ఉన్నత బురుజులను అగ్ని దహించివేస్తుంది.
8 మరియు నేను అష్టోదు§§ లో సింహాసనంపై కూర్చున్న వానిని నాశనం చేస్తాను. అష్కెలోనులో*** రాజదండం ధరించిన రాజును నేను నాశనం చేస్తాను. నేను ఎక్రోను††† ప్రజలను నాశనం చేస్తాను. ఇంకా బతికివున్న ఫిలిష్తీయులు అప్పుడు మరణిస్తారు.” దేవుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
ఫెనీషియా(ఫెనీకే) వారికి శిక్ష
9 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “తూరు‡‡‡ ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే వారు ఒక దేశ ప్రజలనందరినీ చెరబట్టి, వారిని బానిసలుగా ఎదోముకు పంపారు. తమ సోదరులతో (ఇశ్రాయేలు) చేసుకొన్న ఒడంబడికను వారు గుర్తు పెట్టుకోలేదు.
10 అందువల్ల తూరు గోడల మీద నేను అగ్నిని రగుల్చుతాను. తూరులో ఎత్తయిన బురుజులను ఆ అగ్ని నాశనం చేస్తుంది.”
ఎదోమీయులకు శిక్ష
11 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఎదోము ప్రజలు చేసిన అనేక నేరాలకు వారిని నేను నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే ఎదోము కత్తి పట్టి తన సోదరుని (ఇశ్రాయేలు) వెంటాడాడు. ఎదోము దయ చూపలేదు. ఎదోము కోపం శాశ్వతంగా కొనసాగింది. అతడు ఒక క్రూర జంతువులా ఇశ్రాయేలును చీల్చి చెండాడాడు.
12 కావున తేమానులో§§§ నేను అగ్నిని రగుల్చుతాను. ఆ అగ్ని బొస్రా* లో ఉన్నతమైన బురుజులను నాశనం చేస్తుంది.”
అమ్మోనీయులకు శిక్ష
13 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “అమ్మోను ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే వారు గిలాదులో గర్భిణి స్త్రీలను చంపారు. ఆ ప్రాంతాన్ని కలుపుకొని తమ రాజ్యాన్ని విస్తరింపజేయటానికి అమ్మోను ప్రజలు ఈ పని చేశారు.
14 కావున రబ్బా† గోడమీద నేను అగ్ని రగుల్చుతాను. అది రబ్బాలోని ఉన్నతమైన బురుజులను నాశనం చేస్తుంది. వారి దేశంలోకి సుడిగాలి వచ్చినట్లు వారికి కష్టాలు వస్తాయి.
15 అప్పుడు వారి రాజులు, నాయకులు పట్టుబడతారు. వారంతా కలిసి చెరపట్టబడతారు.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
* 1:2: కర్మెలు పర్వతం ఇది ఇశ్రాయేలులో ఉన్న పర్వతం. దీనికి “దేవుని ద్రాక్షాతోట” అని అర్థం. అనగా ఇది మిక్కిలి సారవంతమైన కొండ అని భావం.
† 1:3: దమస్కు (డెమాస్కస్) ఇది సిరియా రాజధాని.
‡ 1:3: గిలాదు మనష్షే వంశీయులు కొందరు నివసించిన ప్రాంతం చూడండి సంఖ్యా. 26:29.
§ 1:4: హజాయేలు సిరయా రాజు. తాను రాజు కావటానికి బెన్హదదును చంపాడు.
** 1:4: బెన్హదదు ఇతడు సిరియా రాజైన హజాయేలు కుమారుడు. ఇతని పేరు, హజాయేలు చేత చంపబడిన వారి పేరు (బెన్హదదు) ఒకటే.
†† 1:6: గాజా ఇది ఫిలిష్తీయుల ఒక ముఖ్యనగరం.
‡‡ 1:6: ఎదోము ఇశ్రాయేలుకు ఆగ్నేయంగా ఉన్న రాజ్యం.
§§ 1:8: అష్టోదు అనేది ఫిలిష్తీయుల ముఖ్యనగరం.
*** 1:8: అష్కెలోను ఫిలిష్తీయుల ముఖ్యనగరం.
††† 1:8: ఎక్రోను ఫిలిష్తీయుల ముఖ్యనగరం.
‡‡‡ 1:9: తూరు ఫెనీషియాకు (ఫెనీకే) తూరు ముఖ్య పట్టణం.
§§§ 1:12: తేమాను ఎదోము దేశంలో ఉత్తర భాగానగల ఒక నగరం.
* 1:12: బొస్రా ఎదోము రాజ్యంలో దక్షిణ భాగానగల ఒక నగరం.
† 1:14: రబ్బా అమ్మోనీయుల రాజధాని.