సింహాల బోనులో దానియేలు
6
తన రాజ్యం అంతటినీ పరిపాలించేందుకు నూట ఇరవైమంది రాజ్యాధికారులను ఎంపిక చేయాలని దర్యావేషు తలంచాడు. అది మంచి ఆలోచన అను కొన్నాడు. మరియు ఆ నూట ఇరవైమంది రాజ్యాధికారుల మీద ఆధిపత్యం గలవారుగా ముగ్గురిని ఎంపిక చేసాడు. ఆ ముగ్గురు ప్రధానులలో దానియేలు ఒకడు. ఎవ్వరూ తనను మోసగించ కూడదని ఆ ముగ్గురిపైన, మరి ఆ నూట ఇరవైమంది పైన దానియేల్ని అధికారిగా ఎంపిక చేశాడు. అందువల్ల తన రాజ్యంలో ఏమీ తాను నష్టపడేది ఉండదు. రాజు దానియేలును మెచ్చు కొన్నాడు. తన మంచి ప్రవర్తన వల్లను, తన సామర్థ్యం వల్లను దానియేలుకు రాజు అలా చేయగలిగాడు. రాజు దానియేలు వశుడయ్యాడు. రాజ్యమంతతికీ దానియేలును పరిపాలకునిగా చెయ్యాలని తలంచాడు. కాని ఈ విషయాన్ని వినగానే ఇతర ప్రధానులు, రాజ్యధి కారులు అసూయ చెందారు. దానియేలులో తప్పుపట్టేందుకు వారు కారణాలు వెదకసాగారు. కనుక రాజ్యంగురించి దానియేలు చేసే పనుల్ని వారు గమనించ సాగారు. కాని దానియేలులో ఏ తప్పూ వారు కనుగొన లేకపోయారు. ప్రజలు విశ్వసించదగిన వ్యక్తి దానియేలు. అతను రాజుని మోసగించలేదు. కష్టించి పని చేసాడు.
చివరికి వారు, “దానియేలుపై తప్పు పట్టేందుకు తగిన కారణం మనమెన్నటికీ కనుగొనలేము. అందువల్ల అతని దేవునికి సంబంధించిన ధర్మం గురించి మనం ఫిర్యాదు చేసేందుకు ఏదో ఒకటి కనుగొనాలి” అని అనుకొన్నారు.
అందువల్ల ఆ ఇద్దరు ప్రధానులు, రాజ్యాధికారులు ఒక బృందంగా రాజు వద్దకు వెళ్లి, “దర్యావేషు రాజు వర్ధిల్లాలి. ప్రధానులు, రాజ్యాధికారులు, ముఖ్యోద్యోగులు, సలహాదారులు, రాజ్యపాలకులు అందరూ ఒక విషయం సమ్మతించారు. రాజు ఈ చట్టం చెయ్యాలని, ఈ చట్టాన్ని ప్రతి వ్యక్తి పాటించాలని భావిస్తున్నాము. ఆ చట్టం ఇది: ఎవరైనా, రాజువైన నిన్ను తప్ప, వచ్చే ముఫ్పై రోజులదాకా, ఏ దేవున్నిగాని, వ్యక్తినిగాని ప్రార్థించినట్లయితే, ఆ వ్యక్తి సింహాల గుహలోకి త్రోసి వేయబడతాడు. రాజా! ఆ చట్టం వ్రాసిన కాగితం మీద సంతకం పెట్టి ఈ విధంగా చట్టం మార్చరానిది, రద్దు చేయరానిది అని ప్రకటించాలి. ఎందుకంటే మాదీయుల మరియు పారసీకుల చట్టాలు మార్చరానివి లేక రద్దు చేయరానివి” అని చెప్పారు. అందువల్ల దర్యావేషు చట్టాన్ని చేసి కాగితంపై సంతకం పెట్టాడు.
10 దానియేలు ప్రతిరోజూ మూడు సార్లు మోకరిల్లి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండేవాడు. ఈ క్రొత్త చట్టం గురించి దానియేలు విని, తన ఇంటికి వెళ్లి, తన ఇంటిమీద ఉన్న గదిలో యెరూషలేము వైపుగా తెరచివున్న కిటికీ వద్ద ఎప్పుడూ చేసే విధంగా, మోకరిల్లి దేవుణ్ణి ప్రార్థించాడు.
11 అప్పుడు ఆ మనుష్యులు ఒక బృందంగా వెళ్లి దానియేలు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన సహాయం కోరుతున్నట్లు వారు కనుగొన్నారు. అందువల్ల వారు బృందంగా రాజు వదకు వెళ్లి, రాజు చేసిన చట్టం గురించి వారతనితో మాట్లాడారు. 12 వారు, “దర్యావేషు రాజా, మీరొక చట్టం జారీ చేశారు. దాని ప్రకారం వచ్చే ముఫ్పై రోజుల్లో ఎవరైనా మిమ్మల్ని కాక ఇతర దేవుణ్ణి గాని వ్యక్తిని గాని ప్రార్థించినట్లయితే, అతను సింహాల గుహలోకి త్రోసి వేయబడతాడు. ఆ చట్టం మీద నీవు సంతకం చేశావు. అవును గదా” అని జ్ఞాపకం చేశారు.
“అవును, నేను ఆ చట్టం మీద సంతకం చేసి మాదీయుల, పారసీకుల చట్టాలు రద్దు చేయరానివి లేక మార్చరానివి” అని ప్రకటించానని రాజు బదులు చెప్పాడు.
13 అప్పుడు ఆ మనుష్యులు రాజుతో, “యూదా నుంచి తీసుకొని రాబడిన బందీలలో దానియేలు అనబడే ఆ వ్యక్తి మీ మాటలపట్ల శ్రద్ధ వహించ లేదు. మీరు చేసిన చట్టాన్ని పాటించ లేదు. ప్రతిరోజూ అతనింకా మూడుసార్లు తన దేవుని స్తుతిస్తున్నాడు” అని చెప్పారు.
14 ఇది వినగానే రాజు చాలా విచారించి, దానియేలును రక్షించడానికి నిశ్చయించాడు. దానియేలును కాపాడేందుకు సూర్యాస్తమయం వరకు ఒక ఉపాయం కోసం రాజు ప్రయత్నించాడు, కాని ప్రయోజనం లేకపోయింది. 15 తర్వాత ఆ మనుష్యులు ఒక బృందంగా రాజు వద్దకు వెళ్లారు. “రాజా, గుర్తుంచుకో. మాదీయుల, పారసీకుల చట్టం చెబుతున్నదేమనగా, రాజు చేసిన చట్టాన్ని మార్చుటకు రద్దు చేయుటకు వీలులేదు” అని వారు చెప్పారు.
16 అందువల్ల రాజైన దర్యావేషు ఆజ్ఞ ప్రకారం దానియేలును తీసుకొని వచ్చి సింహాల గుహలోకి త్రోసివేశారు. రాజు దానియేలుతో ఇట్లన్నాడు: “నీవు నిరంతరం ఆరాధించే నీ దేవుడే నిన్ను రక్షిస్తాడని భావిస్తున్నాను.” 17 ఒక పెద్ద బండను తీసుకువచ్చి, దానిని సింహాల గుహ యొక్క ద్వారం మీద ఉంచారు. తర్వాత రాజు తన ఉంగరంతోను, మరియు తన ఉద్యోగుల ఉంగరాలతోను ఆ బండమీద ముద్రలు వేశారు. ఎవ్వరూ బండను తొలగించి, దానియేలును సింహాల గుహనుంచి వెలుపలికి తీసుకు రాకూడదని ఇలా చేశారు. 18 తర్వాత దర్యావేషు రాజు తన ఇంటికి మరలి పోయాడు. ఆ రాత్రి రాజు భోజనం చేయలేదు. ఎవ్వరూ ఆ రాత్రి తనకు వినోదాన్ని కలిగించకూడదని అదేశించాడు. ఆ రాత్రంతా రాజు నిద్ర పోలేదు.
19 ఆ మరునాటి ఉదయం రాజైన దర్యావేషు వెలుతురు వస్తూండగా సింహాల గుహవద్దకు పరుగెత్తుకు వెళ్లాడు. 20 రాజు చింతాక్రాంతుడుగా సింహాల గుహవద్దకు వెళ్లి దానియేలును ఇలా పిలిచాడు: “సజీవుడగు దేవుని సేవకుడవైన దానియేలూ, నీవెప్పుడూ ఆరాధించే నీ దేవుడు నిన్ను సింహాల బారినుండి కాపాడగలిగెనా?”
21 “రాజా, నీవు చిరకాలము వర్ధిల్లాలి! 22 నా దేవుడు నన్ను రక్షించడానికి తన దూకను పంపి సింహాల నోళ్లను మూసివేశాడు. నా దేవునికి నేను కళంకరహితుణ్ణి అని తెలుసు, కనుకనే సింహాల నన్ను గాయపరచలేదు. రాజా, నీకెప్పుడూ నేను అన్యాయం చెయ్యలేదు”అని దానియేలు బదులు చెప్పాడు.
23 దర్యావేషు రాజు చాలా సంతోషించాడు. సింహాల గుహనుండి దానియేలును పైకి తీయవలసిందిగా రాజు తన సేవకుల్ని ఆజ్ఞాపించాడు. వారు గుహనుండి దానియేలుని పైకి తీయగా, వారతని దేహంమీద ఎలాంటి గాయాన్ని చూడలేదు. దానియేలు తన దేవున్ని విశ్వసించిన కారణంగా, అతనికి సింహాలవల్ల ఎలాంటి హాని జరగలేదు.
24 తర్వాత దానియేలుని సింహాల గుహకు పంపడానికి కారణమైన ఆ మనుష్యుల్ని తీసురురమ్మని రాజు ఆజ్ఞాపించాడు. సింహాల గుహలోకి ఆ మనుష్యులను, వారి భార్యలను, వారి సంతానాన్ని త్రోసివేయగా వారు సింహాల గుహ అడుగుభాగం తాకక ముందే సింహాలు వారి శరీరాలను కబళించి వారి ఎముకల్ని విరుగగొట్టాయి.
25 తర్వాత ప్రపంచమంతటా విభిన్న భాషలు మాట్లాడే ఆ మనుష్యులకందరికీ రాజైన దర్వావేషు ఈ క్రింది లేఖను వ్రాశాడు:
అందురికి శుభమగు గాక!
26 నేనిప్పుడు క్రొత్త చట్టం చేస్తున్నాను. నా రాజ్యంలో ఏ భాగంలో నివసించే వారికైనా ఇది వర్తిస్తుంది. మీరందరూ దానియేలు యొక్క దేవునికి భయపడి వణకాలి.
దానియేలు దేవుడే సజీవుడు.
ఆయన ఎప్పుడూ జీవిస్తాడు.
ఆయన రాజ్యం ఎన్నటికీ నశించదు,
ఆయన పరిపాలన అంతం కాదు.
27 దేవుడు ప్రజలకు సహాయం చేస్తాడు, రక్షిస్తాడు.
ఆయన ఆశ్చర్యాలను, అద్భుతాలను పరలోక మందునూ, భూమి మీదనూ చేస్తాడు.
దేవుడు దానియేలును సింహాలనుండి రక్షించాడు.
28 అందువల్ల దర్యావేషు రాజుగా ఉన్న కాలంలోనూ, పారశీకుడైన కోరెషు రాజుగావున్న కాలంలోనూ దానియేలు అభివృద్ధి చెందాడు.