ఐశ్వర్యం సంతోషాన్ని ఇవ్వదు
6
1 నేను ఈ ప్రపంచంలో అసమంజసమైన మరో విషయాన్ని గమనించాను. దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం.
2 దేవుడు ఒక మనిషికి గొప్ప సంపద, ఆస్తి మరియు గౌరవమూ ప్రసాదిస్తాడు. అతనికి కావలసినవన్నీ, అతను కోరుకోగలిగిన సమస్తం వుంటాయి. అయితే, ఆ వ్యక్తి వాటిని అనుభవించకుండా చేస్తాడు దేవుడు. ఒక అపరిచితుడు వస్తాడు, వాటన్నింటినీ చేజిక్కించుకుంటాడు. ఇది కూడా అర్థరహితమైన చాలా చెడ్డ విషయమే.
3 ఒక వ్యక్తి దీర్ఘకాలం జీవించవచ్చు. అతనికి వంద మంది సంతానం ఉండవచ్చు. అయితే, ఈ మంచి విషయాలు అతనికి తృప్తి కలిగించలేదనీ, అతని మరణానంతరం* ఏ ఒక్కరూ అతన్ని జ్ఞాపకం ఉంచుకోరనీ అనుకోండి, అప్పుడు అతనికంటె పురిట్లోనే చనిపోయే శిశువు మెరుగని నేనంటాను.
4 మృత శిశువుగా పుట్టడం నిజంగానే అర్థరహితం. పేరైనా లేని ఆ శిశువుని చటుక్కున తీసుకుపోయి సూర్యరశ్మి చొరని చీకటి సమాధిలో పూడ్చేస్తారు.
5 సూర్యరశ్మినైనా చూడని ఆ శిశువుకి బొత్తిగా ఏది ఏమాత్రం తెలియదు. కాని, దేవుడు తనకిచ్చిన మంచివాటిని అనుభవించని ఆ మనిషికంటె ఆ శిశువు ఎక్కువ ప్రశాంతిని అనుభవిస్తుంది.
6 ఆ మనిషి రెండు వేల సంవత్సరాలు బతకవచ్చుగాక. అయినా అతను తనకు ఇచ్చిన జీవితాన్ని అనుభవించక పోతే అతనికంటె గర్భంలో చనిపోయిన శిశువు సులభమయిన మార్గంతో ఆ అంత్యదశను పొందిందనవచ్చు.
7 మనిషి చచ్చేలా పాటుపడతాడు తిండి కోసం. అయితే, అతను ఎన్నడూ తృప్తి చెందడు.
8 వివేకవంతుడు అవివేకికంటె విశేషమైనవాడు కాడు. అంత కంటె, ఉన్నదున్నట్లు జీవితాన్ని స్వీకరించడం తెలిసిన బీదవాడు మేలు
9 ఉన్నదానితో తృప్తి చెంది సంతోషంగా ఉండటం ఎప్పుడూ ఇంకా ఇంకా ఏదో కావాలని అశించడం మేలు. ఎప్పుడూ ఇంకా ఇంకా కావాలని కోరుకోవడం వృధా ప్రయాసం. అది గాలిని మూట గట్టుకొనేందుకు చేసే ప్రయత్నమే.
10-11 మనిషి ఎందుకు సృష్టింపబడ్డాడు? మనిషిగా ఉండేందుకు మాత్రమే. దీన్ని గురించి చర్చించడం వృధా ప్రయాసమే. దీన్ని గురించి మనిషి దేవునితో చర్చించలేడు. ఎందుకంటే, మనిషికంటె దేవుడు శక్తిమంతుడు. సుదీర్ఘంగా వాదించినంత మాత్రాన ఈ వాస్తవం మారిపోదు.
12 భూమిమీద స్వల్ప కాలం జీవించే మనిషికి, ఆ స్వల్ప కాలంలో అతనికి ఏది అత్యుత్తమమైనదో ఎవరికి తెలుస్తుంది? అతని జీవితం నీడలా గడిచిపోతుంది. తర్వాత ఏమి జరుగుతుందో ఎవరూ అతనికి చెప్పలేరు.