గొర్రెల మందవంటి ఇశ్రాయేలు
34
1 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు:
2 “నరపుత్రుడా, నీవు నా తరఫున ఇశ్రాయేలు గొర్రెల కాపరులకు (పాలకులకు) వ్యతిరేకంగా మాట్లాడు. నా తరఫున వాళ్లతో మాట్లాడు. ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని వారికి తెలుపు: ‘ఇశ్రాయేలు కాపరులారా మీకు మీరే బాగా తింటున్నారు. అది మీకు చాలా హానికరం! ఓ కాపరులారా, మీరు మందను ఎందుకు మేపరు?
3 బాగా బలిసిన గొర్రెలను మీరు తింటారు. మీ దుస్తులకై వాటి ఉన్నిని వినియోగించు కుంటారు. బలిసిన గొర్రెలను మీరు చంపుతారు; కాని మందను మాత్రం మీరు మేపరు.
4 బలహీనంగా ఉన్న వాటిని మీరు బలంగా తయారు చేయలేదు. జబ్బు చేసిన గొర్రెల విషయమై మీరు శ్రద్ధ తీసుకోలేదు. గాయ పడిన గొర్రెలకు మీరు కట్టు కట్టలేదు. కొన్ని గొర్రెలు అటు ఇటు చెదరి వెళ్లిపోయాయి. అయినా మీరు వెళ్లి వాటిని తీసుకురాలేదు. తప్పిపోయిన గొర్రెలను వెదకటానికి మీరు వెళ్లలేదు. లేదు; మీరు చాలా కృ఼రులు, కఠినాత్ములు—ఆ రకంగా మీరు మందను నడిపించ ప్రయత్నించారు!
5 “‘కాపరిలేని కారణంగా ఇప్పుడు మంద చెల్లాచెదరై పోయింది. ప్రతి అడవి జంతువుకు అని ఆహారమైనాయి. అలా అవి చిందర వందరై పోయాయి.
6 నా మంద ప్రతి పర్వతం మీద, ప్రతి కొందమీద తిరుగాడింది. నా మంద భూమిమీద అంతటా చెల్లాచెదరై పోయింది. వాటిని వెదకటానికి గాని, చూడటానికి గాని ఎవ్వరూ లేరు.’”
7 కావున ఓ గొర్రెల కాపరులారా! యెహోవా మాట వినండి. నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు:
8 “నా జీవముతోడుగా మీకు నేనిలా మాట ఇస్తున్నాను. అడవి జంతువులు నా మందను పట్టుకున్నాయి. అవును, నా మంద అన్ని కృ఼ర జంతువులకూ ఆహారమయ్యింది. ఎందువల్లనంటే వాటికి నిజమైన కాపరిలేడు. నా గొర్రెల కాపరులు నా మంద విషయమై తగిన జాగ్రత్త తీసుకోలేదు. మరియు ఆ కాపరులు కేవలం నా మందను చంపుకు తిన్నారే గాని, దానిని మేపలేదు.”
9 అందువల్ల, ఓ కాపరులారా, యెహోవా మాట వినండి!
10 యెహోవా ఇలా చెపుతున్నాడు: “నేను ఆ కాపరులకు విరోధిని! నా గొర్రెల కొరకు నేను వారిని అడుగుతాను. నేను వారిని తీసివేస్తాను ఇక ఎంతమాత్రం వారు నా మందకు కాపరులుగా కొన సాగరు! దానితో వారు మందను చంపి తమ పొట్టను నింపుకోలేరు. వారి బారినుండి నా మందను నేను రక్షించుకోగలుగుతాను. అప్పుడు నా గొర్రెలు వారికి ఆహారం కాజాలవు.”
11 నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “నాకు నేనే వారికి కాపరిగా వ్యవహరిస్తాను. చెదరి పోయిన నా గొర్రెలను నేనే వెదకుతాను. నేను వాటి విషయమై జాగ్రత్త తీసుకుంటాను.
12 తన గొర్రెలు తప్పిపోయినప్పుడు ఒక కాపరి వాటి వెంట ఉంటే, అతడు వెళ్లి వాటికొరకు వెదకగలడు. అదే విధంగా, నేను నా గొర్రెల కొరకు వెదకుతాను. నేను నా గొర్రెలను రక్షించుకుంటాను. ఒకానొక ముసురు పట్టిన చీకటి రోజూ చెదరిపోయిన నా గొర్రెలను ఆయా ప్రాంతాల నుండి వెదకి తీసుకు వస్తాను.
13 ఆయా దేశాలనుండి వాటిని తిరిగి తీసుకొని వస్తాను. ఆ ప్రాంతాల నుండి వాటిని కుడదీస్తాను. వాటి స్వదేశానికి వాటిని తీసుకొని వస్తాను. ఇశ్రాయేలు పర్వతాల పైన, సెలయేటి గట్ల మీద, ప్రజలు నివసించే అన్ని ప్రాంతాలలోను నేను వాటిని మేపుతాను.
14 నేను వాటిని పచ్చిక బీళ్లకు నడిపిస్తాను. ఇశ్రాయేలు కొండలశిఖరాల పైకి అవి వెళతాయి. అవి అక్కడ పచ్చిక మేసి, మంచి ప్రదేశంలో హాయిగా పండుకొంటాయి. ఇశ్రాయేలు పర్వతాల మీద మంచి పచ్చిక భూములలో అవి మేత మేస్తాయి.
15 అవును, నా మందను నేనే మేపుతాను. వాటిని ఒక విశ్రాంతి స్థలానికి నడిపిస్తాను.” నా ప్రభువైన యెహోనా ఈ విషయాలు చెప్పాడు.
16 “పోయిన గొర్రెలను నేను వెదకుతాను. చెదరి పోయిన గొర్రెలను నేను తిరిగి తోలుకు వస్తాను. గాయపడిన గొర్రెలకు కట్లు కడతాను. నీరసపడిన గొర్రెలు బలపడేలా చేస్తాను. కాని ఆ బలిసిన, శక్తివంత మైన గొర్రెల కాపరులను మాత్రం నేను నాశనం చేస్తాను. వారికి అర్హమైన శిక్ష వారికి నేను విధిస్తాను.”
17 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “మీరు, నా గొర్రెల మంద. నేను మీలో ఒక్కొక్కదానికి తీర్పు ఇస్తాను. పొట్టేళ్లను, మేక పోతులకు మధ్య తీర్పు తీర్చుతాను.
18 సారవంతమైన భూముల్లో పెరిగే గడ్డిని మీరు తినవచ్చు. అటువంటప్పుడు ఇతర గొర్రెలు మేసే గడ్డిని మీలో కొందరు మీ కాళ్లతో ఎందుకు తొక్కి పాడుచేస్తారు? మీరు స్వచ్ఛమైన నీటిని కావలసినంత తాగవచ్చు! అలా కాకుండా ఇతర గొర్రెలు తాగదల్చుకున్న నీటిని కూడా మీరెందుకు కెలికి మురికి చేస్తున్నారు?
19 మీ కాళ్లతో తొక్కి పాడుచేసిన గడ్డిని నా మంద తింటున్నది. మీ కాళ్లతో కెలికి మురికి చేసిన నీటిని అవి తాగవలసి ఉందా!”
20 కావున నా ప్రభువైన యెహోవా వాటికి ఇలా చెపుతున్నాడు: “నాకై నేనే బలిసిన గొర్రెలకు, బక్క చిక్కిన గొర్రెలకు మధ్య తీర్పు ఇస్తాను!
21 బక్క జీవాలు అవతలికి పారిపోయే వరకు వాటిని మీరు మీ భుజాలతోను, పార్శ్వాలతోను తోసి, మీ కొమ్ములతో కుమ్ముతారు.
22 కావున నా మందను నేనే రక్షించు కుంటాను. అవి ఇక ఎంత మాత్రం క్రూర జంతువుల బారిన పడవు. గొర్రెకు మరొక గొర్రెకు మధ్య నేనే తీర్పు ఇస్తాను.
23 తరువాత నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను. అతడు వాటిని మేపుతాడు. అతడు వాటిని స్వయంగా మేపి, వాటిని కాపరి అవుతాడు.
24 ప్రభువును యెహోవాను అయిన నేను అప్పుడు వాటికి దేవుడనవుతాను. నా సేవకుడగు దావీదు వాటి మధ్య నివసిస్తూ పాలకుడవుతాడు. యెహోవానైన నేనే చెపుతున్నాను.”
25 “మరియు నా గొర్రెలతో నేను శాంతి ఒడంబడిక చేసుకుంటాను. దేశంలో కృ఼ర జంతువులు లేకుండా చేస్తాను. అప్పుడే గొర్రెలు ఎడారిలో నిర్భయంగా తిరిగి, అడవులలో హాయిగా నిద్రిస్తాయి.
26 నేను నా గొర్రెలను, నా కొండ (యెరూషలేము) చుట్టూ ఉన్న ప్రదేశాలను దీవిస్తాను. సకాలంలో వర్షాలు కురిసేలా చేస్తాను. దీవెనకరమైన జల్లులు పడతాయి.
27 పొలాల్లో పెరిగే చెట్లు ఫలాల నిస్తాయి. భూమి తన పంటనిస్తుంది. కావున గొర్రెలు తమ భూమిమీద సురక్షితంగా ఉంటాయి. బాని సత్వానికి చిహ్నమైన వాటి మెడమీది కాడిని* నేను విరుగ గొడతాను. వాటిని బానిసలుగా చేసిన మనుష్యుల అధికారం నుండి వాటికి విముక్తి కలుగజేస్తాను. అప్పుడు నేనే యెహోవానని అవి గుర్తిస్తాయి.
28 అవి ఇక ఎంతమాత్రం మామూలు జంతువులవలె అన్య దేశీయులచే పట్టుబడవు. ఆ కృ఼ర మృగాలు వాటిని ఇక ఎంతమాత్రం తినవు. అవి సురక్షితంగా జీవిస్తాయి. ఎవ్వరూ వాటిని భయ పెట్టలేరు.
29 మంచి ఉద్యానవనంగా తయారయ్యే కొంత భూమిని వాటికి ఇస్తాను. ఆ భూమిలో అవి ఇక ఎంతమాత్రం ఆకలితో బాధపడవు. ఇక ఏ మాత్రం అవి అన్యదేశాల నుండి అవమానాన్ని పొందవు.
30 అప్పుడవి నేనే వాటి దేవుడనగు యెహోవానని తెలుసుకుంటాయి. నేను వాటితో ఉన్నానని అవి తెలుసుకుంటాయి. మరియు ఇశ్రాయేలు వంశం వారు తాము నా ప్రజలేనని తెలుసుకుంటారు!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
31 “నా గొర్రెల్లారా, నా పచ్చిక బయలులో ఉండే నా గొర్రెల్లారా మీరు కేవలం మానవ మాత్రులు. నేను మీ దేవుడను.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.