అబ్రాహాము గెరారుకు వెళ్లుట
20
1 అబ్రాహాము ఆ చోటు విడిచి నెగెబుకు ప్రయాణం కట్టాడు. కాదేషుకు, షూరుకు మధ్యనున్న గెరారుకు అబ్రాహాము వెళ్లాడు. గెరారులో ఉన్నప్పుడు
2 శారా తన సోదరి అని అబ్రాహాము ప్రజలతో చెప్పాడు. గెరారు రాజు అబీమెలెకు ఇది విన్నాడు. అబీమెలెకు శారాను ఇష్టపడి, ఆమెను తీసుకుని వచ్చేందుకు కొందరు సేవకుల్ని పంపించాడు.
3 అయితే ఆ రాత్రి దర్శనంలో అబీమెలెకుతో దేవుడు మాట్లాడి, “చూడు, నీవు చస్తావు. నీవు తెచ్చుకొన్న ఆ స్త్రీ వివాహితురాలు” అని చెప్పాడు.
4 కానీ అప్పటికి అబీమెలెకు శారాతో శయనించ లేదు. కనుక అబీమెలెకు, “ప్రభూ, నేను దోషిని కాను. నిర్దోషిని నీవు చంపుతావా?
5 ‘ఈ స్త్రీ నా సోదరి’ అని అబ్రాహాము స్వయంగా నాతో చెప్పాడు. ఆ స్త్రీ కూడా ‘ఈ పురుషుడు నా సోదరుడు’ అని చెప్పింది. నేను నిర్దోషిని. నేను చేస్తున్నది ఏమిటో నాకు తెలియలేదు” అన్నాడు.
6 ఆ దర్శనంలో అబీమెలెకుతో దేవుడు ఇలా చెప్పాడు: “అవును, నాకు తెలుసు, నీవు నిర్దోషివి. నీవు చేస్తున్నది ఏమిటో నీకు తెలియదు అని నాకు తెలుసు. నేను నిన్ను కాపాడాను. నాకు వ్యతిరేకంగా నిన్ను నేను పాపం చేయనీయలేదు. నీవు ఆమెతో శయనించకుండా చేసింది నేనే.
7 కనుక అబ్రాహాము భార్యను తిరిగి అతనికి అప్పగించు. అబ్రాహాము ఒక ప్రవక్త.* అతడు నీ కోసం ప్రార్థిస్తాడు, అప్పుడు నీవు బతుకుతావు. కానీ శారాను నీవు తిరిగి అబ్రాహాముకు ఇవ్వకపోతే, నీవు మరణించడం తప్పదు. నీతోబాటు నీ కుటుంబం అంతా మరణిస్తుంది.”
8 కనుక మర్నాడు వేకువనే, అబీమెలెకు తన సేవకులందరినీ పిల్చాడు. దర్శనంలో సంభవించిన సంగతులన్నీ అబీమెలెకు వారితో చెప్పాడు. సేవకులు చాలా భయపడ్డారు.
9 అప్పుడు అబీమెలెకు అబ్రాహామును పిలిచి, అతనితో అన్నాడు: “నీవు మాకు ఎందుకు ఇలా చేసావు? నీకు నేను ఏమి అపకారం చేసాను? ఎందుకలా అబద్ధం చెప్పి, ఆమె నీ సోదరి అన్నావు? నా రాజ్యానికి నీవు చాలా చిక్కు తెచ్చిపెట్టావు. నాకు నీవు ఇలా చేయకుండా ఉండాల్సింది.
10 నీవు దేనికి ఇలా చేసావు?”
11 అందుకు అబ్రాహాము చెప్పాడు: “నేను భయపడ్డాను. దేవుడంటే ఇక్కడ ఎవరికీ భయము లేదని అనుకొన్నాను. శారాను పొందటం కోసం ఎవరైనా నన్ను చంపేస్తారు అనుకొన్నాను.
12 ఆమె నా భార్య, అయితే నా సోదరి కూడాను. ఆమె నా తండ్రి కుమార్తె గాని, నా తల్లి కుమార్తె కాదు.
13 నా తండ్రి ఇంటినుండి దేవుడు నన్ను బయటకు నడిపించాడు. అనేక చోట్ల సంచారం చేసేటట్టు దేవుడు నన్ను నడిపించాడు. అలా జరిగినప్పుడు, ‘నీవు నా సోదరివని ప్రజలతో మనం వెళ్లిన చోటల్లా చెప్పు, నాకు ఈ మేలు చేయి’ అని నేను శారాతో చెప్పాను.”
14 అప్పుడు జరిగిందేమిటో అబీమెలెకు అర్థం చేసుకొన్నాడు. కనుక శారాను అబీమెలెకు తిరిగి అబ్రాహాముకు అప్పగించేసాడు. కొన్ని గొర్రెలు, పశువులు, కొందరు ఆడ, మగ బానిసలను కూడ అబీమెలెకు అబ్రాహాముకు ఇచ్చాడు.
15 మరియు “నీ చుట్టూ చూడు. ఇది నా దేశం. నీకు ఇష్టం వచ్చిన చోట నీవు ఉండవచ్చు” అన్నాడు అబీమెలెకు.
16 “చూడు, నీ సోదరుడైన అబ్రాహాముకు 1,000 వెండి నాణెములు ఇచ్చాను. జరిగిన వాటి విషయమై నా పశ్చాత్తాపం వ్యక్తం చేయడానికి యిది చేసాను. నేను సక్రమంగా జరిగించినట్టు అందరూ చూడాలని నేను కోరుతున్నాను” అని అబీమెలెకు శారాతో చెప్పాడు.
17-18 అబీమెలెకు కుటుంబంలోని స్త్రీలను గొడ్రాళ్లుగా చేసాడు యెహోవా. అబ్రాహాము భార్య శారాను అబీమెలెకు తీసుకొన్నందుచేత దేవుడు ఇలా చేసాడు. అయితే అబ్రాహాము ప్రార్థించగా అబీమెలెకును, అతని భార్యను మరియు అతని దాసీలను దేవుడు స్వస్థపరచాడు.
* 20:7: ప్రవక్త ప్రజలు ఏ విధంగా నడుచుకోవాలని దేవుడు కోరుతున్నాడో దాన్ని గూర్చి ప్రజలకు ప్రబోధించేవాడు.