యెరికోను స్వాధీనపర్చుకొనటం
6
1 యెరికో పట్టణం మూసివేయబడింది. ఇశ్రాయేలు ప్రజలు దగ్గర్లోనే ఉన్నందువల్ల ఆ పట్టణం లోని ప్రజలు భయపడ్డారు. ఎవరూ పట్టణంలోనికి గాని, బయటకు గాని వెళ్లలేదు.
2 అప్పుడు యెహోషువతో యోహోవా చెప్పాడు: “చూడు, యెరికో పట్టణాన్ని నేను నీ స్వాధీనంలో ఉంచాను. దాని రాజు, పట్టణంలోని యుద్ధ వీరులు నీ స్వాధీనంలో ఉన్నారు.
3 నీ సైన్యంతో పట్టణం చుట్టూ రోజుకు ఒక్కసారి ప్రదక్షిణం చేయి. ఇలా ఆరు రోజులు చేయి.
4 పొట్టేలు కొమ్ములతో చేసిన బూరలు ఊదేందుకు ఏడుగురు యాజకులను నియమించుము. పవిత్ర పెట్టెకు ముందుగా నడువుమని యాజకులతో చెప్పు. ఏడో రోజున ఏడుసార్లు పట్టణం చుట్టూ ప్రదక్షిణం చేయండి. ఏడోరోజున వారు ముందడుగు వేయగానే బూరలు ఊదాలని యాజకులతో చెప్పు.
5 యాజకులు బూరలతో పెద్ద శబ్దం చేయాలి. ఆ శబ్దం నీవు వినగానే ప్రజలందర్నీ కేకలు వేయమని చెప్పు. మీరు ఇలా చేయగానే పట్టణం యొక్క గోడలు కూలిపోతాయి. అప్పుడు మీ ప్రజలు సరాసరి పట్టణం లోనికి వెళ్లిపోవాలి.”
6 కనుక నూను కుమారుడైన యెహోషువ యాజకులందర్నీ సమావేశపర్చాడు. “యెహోవా పవిత్ర పెట్టెను మోయండి. ఏడుగురు యాజకులు బూరలు మోయాలని చెప్పండి. ఆ యాజకులు పవిత్ర పెట్టెకు ముందుగా నడవాలి” అని యెహోషువ వారితో చెప్పాడు.
7 “ఇప్పుడు బయల్దేరండి. పట్టణం చుట్టూ నడవండి. ఆయుధాలు ధరించిన సైనికులు యెహోవా పవిత్ర పెట్టె ఎదుట నడవాలి” అని యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించాడు.
8 యెహోషువ ప్రజలతో మాట్లాడటం ముగించగానే, ఏడుగురు యాజకులు యెహోవా సన్నిధిని నడవటం మొదలుబెట్టారు. ఏడు బూరలను వారు మోసుకొని వెళ్లారు. వారు నడుస్తూ ఉన్నప్పుడు బూరలు ఊదారు. యెహోవా పవిత్ర పెట్టెను మోసే వారు వారి వెనుక నడిచారు.
9 ఆయుధాలు ధరించిన సైనికులు యాజకులకు ముందుగా నడిచారు. పవిత్ర పెట్టె వెనుక నడుస్తోన్న వాళ్లు బూరలు ఊదారు.
10 అయితే యుద్ధనాదం చేయవద్దని యెహోషువ ప్రజలతో చెప్పాడు. “కేకలు వేయకండి. నేను మీతో చెప్పే రోజు వరకు ఒక్క మాటకూడ పలుకకండి. తరువాత మీరు కేకలు వేయవచ్చు” అన్నాడు యోహోషువ.
11 కనుక యెహోవా పవిత్ర పెట్టెను పట్టణంచుట్టూ ఒక్క సారి యాజకులచేత యెహోషువ మోయించాడు. తర్వాత వారు వారి బసకు వెళ్లి ఆ రాత్రి అక్కడే గడిపారు.
12 మర్నాటి ఉదయాన్నే యెహోషువ లేచాడు. యాజకులు యెహోవా పవిత్ర పెట్టెను మరలా మోసారు.
13 మరియు యాజకులు ఏడుగురు ఏడు బూరలు మోసారు. యెహోవా పవిత్ర పెట్టె ఎదుట వారు నడుస్తూ బూరలు ఊదారు. ఆయుధాలు ధరించిన సైనికులు వారికి ముందుగా నడిచారు. యెహోవా పవిత్ర పెట్టె వెనుక నడిచే యాజకులు నడుస్తూ, బూరలు ఊదారు.
14 కనుక రెండో రోజున వాళ్లంతా పట్టణం చుట్టూ ఒక మారు ప్రదక్షిణం చేసారు. ఆ తర్వాత వాళ్లు తిరిగి వారి బసకు వెళ్లిపోయారు. ఆరు రోజులపాటు వారు ఇలానే ప్రతిరోజూ చేసారు.
15 ఏడో రోజు సూర్యోదయాన్నే వారు మేల్కొన్నారు. వారు పట్టణం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణాలు చేసారు. అంతకు ముందు రోజులలో నడచినట్టే నడిచారు, కాని ఆ రోజు పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరిగారు.
16 పట్టణం చుట్టూ వారు ఏడోసారి తిరుగగానే, యాజకులు వారి బూరలు ఊదారు. సరిగ్గా అప్పుడే యెహోషువ ఆజ్ఞ యిచ్చాడు: “ఇప్పుడు కేకలు వేయండి! యెహోవా ఈ పట్టణాన్ని మీకు ఇచ్చేస్తున్నాడు!
17 ఈ పట్టణం, ఇందులో ఉన్న సమస్తం యోహోవాదే.* వేశ్య రాహాబు, ఆమె ఇంటిలో ఉన్న వారు మాత్రమే బ్రతకాలి. మనం పంపిన ఇద్దరికీ రాహాబు సహాయం చేసింది గనుక వారిని చంపకూడదు.
18 మరియు మిగిలిన వాటన్నింటినీ మనం నాశనం చేసివేయాలని జ్ఞాపకం ఉంచుకోండి. వాటిని తీసుకోవద్దు. మీరు వాటిని తీసుకొని, మన పాళెములోనికి గనుక తీసుకొని వస్తే మిమ్మల్ని మీరే నాశనం చేసుకొంటారు. పైగా మీరు మొత్తం ఇశ్రాయేలు ప్రజలందరికీ కష్టం తెచ్చి పెడ్తారు.
19 వెండి, బంగారం మరియు ఇత్తడి, ఇనుముతో చేసిన వస్తువులన్నీ మొత్తం యోహోవాకే చెందుతాయి. వాటన్నింటినీ ఆయన కోసం దాచిపెట్టాలి.”
20 యాజకులు బూరలు ఊదారు. ప్రజలు బూరలువిని కేకలు వేయటం మొదలుబెట్టారు. గోడలు కూలి పోయాయి. ప్రజలు ఏకంగా పట్టణంలో జొరబడి పోయారు. అందుచేత ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణాన్ని ఓడించేసారు.
21 ఆ పట్టణంలో ఉన్న సమస్తాన్ని ప్రజలు నాశనం చేసారు. అక్కడ ప్రాణంతో ఉన్న సమస్తాన్ని వాళ్లు నాశనం చేసారు. పడుచు కుర్రాళ్లను పెద్ద మగవాళ్లను, పడుచు పిల్లల్ని, స్త్రీలను పశువుల్ని, గొర్రెల్ని, గాడిదల్ని వారు చంపేశారు.
22 ఆ దేశాన్ని చూసేందుకు తాను పంపించిన ఇద్దరు మనుష్యులతో యోహోషువ మాట్లాడాడు: “ఆ వేశ్య ఇంటికి వెళ్లండి. ఆమెను బయటకు తీసుకొని రండి. మరియు ఆమెతో ఉన్న వాళ్లందరినీ బయటకు తీసుకొని రండి. మీరు ఆమెతో చేసిన వాగ్దానం ప్రకారం మీరు ఇలా చేయండి.”
23 కనుక ఆ ఇద్దరు మనుష్యులూ ఆ ఇంట్లోకి వెళ్లి, రాహాబును బయటకు తీసుకొని వచ్చారు. ఆమె తండ్రి, తల్లి, సోదరులు, ఆమె కుటుంబం మొత్తం, ఆమెతో ఉన్న వాళ్లందర్నీ వారు బయటకు తీసుకొనివచ్చారు. ఆ మనుష్యులందరినీ ఇశ్రాయేలీయుల పాళెము వెలుపల క్షేమకరమైన చోట వారు ఉంచారు.
24 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణం మొత్తాన్ని తగులబెట్టేసారు. వెండి, బంగారం, ఇత్తడి, ఇనుముతో చేయబడినవి తప్ప ఆ పట్టణంలో ఉన్న వాటన్నింటినీ వారు కాల్చేసారు. ఇవన్నీ యెహోవా కోసం భద్రం చేయబడ్డాయి.
25 వేశ్య రాహాబును, ఆమె కుటుంబాన్ని, ఆమెతో ఉన్నవారందరినీ యెహోషువ రక్షించాడు. యెరికోను వేగు చూచేందుకు యెహోషువ పంపిన మనుష్యులకు రాహాబు సహాయం చేసింది కనుక యెహోషువ వారిని బ్రదుకనిచ్చాడు. నేటికీ రాహాబు ఇశ్రాయేలు ప్రజల్లో సజీవంగా ఉండిపోయింది.
26 ఆ సమయంలోనే ముఖ్యమైన ఈ వాగ్దానం యెహోషువ చేసాడు:
“ఈ యెరికో పట్టణాన్ని మరల ఎవరైనా కట్టడానికి ప్రయత్నిస్తే
వారు యెహోవా వలన ప్రమాదానికి గురి అవుతారు.
ఈ పట్టణానికి పునాది వేసే మనిషి
తన పెద్ద కుమారుణ్ణి పోగొట్టుకుంటాడు.
ద్వారాలు నిలబెట్టేవాడు
తన చిన్న కుమారుణ్ణి పోగొట్టుకొంటాడు.”
27 కనుక యెహోవా, యెహోషువకు తోడుగా ఉన్నాడు. మరియు యెహోషువ ఆ దేశం అంతటా ప్రసిద్ధి చెందాడు.
* 6:17: సమస్తం యోహోవాదే సామాన్యంగా శత్రువులనుండి తెచ్చిన విలువైన వస్తువులను దేవాలయపు ఖజానాలో ఉంచుతారు. లేక వాటిని నాశనం చేస్తారు.