28
దావీదు కీర్తన.
1 యెహోవా, నీవే నా అండవు.
సహాయం కోసం నేను నిన్ను పిలుస్తున్నాను.
నా ప్రార్థనలకు నీ చెవులు మూసుకోవద్దు.
సహాయంకోసం పిలుస్తున్న నా పిలుపుకు నీవు జవాబు ఇవ్వకపోతే
అప్పుడు నేను సమాధిలోనున్న శవాల్లాగే ఉంటాను.
2 యెహోవా, నేను నా చేతులు ఎత్తి, నీ అతి పవిత్ర స్థలం వైపు ప్రార్థిస్తున్నాను.
నేను నిన్ను వేడుకొన్నప్పుడు, నా మాట ఆలకించుము.
నా మీద దయ చూపించుము.
3 యెహోవా, నేను చెడ్డవాళ్లవలె ఉన్నానని తలచవద్దు. చెడు కార్యాలు చేసే దుర్మార్గుల్లోకి నన్ను లాగకుము.
ఆ మనుష్యులు వారి పొరుగువారిని “షాలోం”* అని అభినందిస్తారు. కానీ వారి హృదయాల్లో వారి పొరుగు వారిని గూర్చి వారు చెడ్డ పథకాలు వైస్తున్నారు.
4 యెహోవా, ఆ మనుష్యులు ఇతరులకు కీడు చేస్తారు.
కనుక వారికి కూడ కీడు జరిగేటట్టుగా చేయుము.
ఆ చెడ్డవాళ్లు శిక్షించబడాల్సిన విధంగా వారిని శిక్షించుము.
5 యెహోవా చేసే మంచి పనులను చెడ్డవాళ్లు గ్రహించరు.
ఆయన చేసే మంచి వాటిని వారు చూడరు, అర్థం చేసుకోరు.
వారు నాశనం చేయటానికి ప్రయత్నిస్తారు.
6 యెహోవాను స్తుతించండి.
కరుణించుమని నేను చేసిన నా ప్రార్థన ఆయన విన్నాడు.
7 యెహోవా నా బలం ఆయనే నా డాలు.
నేను ఆయనను నమ్ముకొన్నాను.
ఆయన నాకు సహాయం చేసాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను.
మరియు నేను ఆయనకు స్తుతి కీర్తనలు పాడుతాను.
8 యెహోవా తన ప్రజలకు బలమైయున్నాడు.
ఆయన ఏర్పాటు చేసుకొన్నవానికి† శక్తి, విజయాలను ఆయన ఇస్తాడు.
9 దేవా, నీ ప్రజలను రక్షించుము.
నీకు చెందిన ప్రజలను ఆశీర్వదించుము.
కాపరిలా వారిని నిత్యం నడిపించుము.