39
సంగీత నాయకునికి. యెదూతూనునకు. దావీదు కీర్తన.
1 “నేను జాగ్రత్తగా నడచుకొంటాను.
నా నాలుకతో నన్ను పాపం చేయనివ్వను” అని నేను అన్నాను.
నేను దుర్మార్గులకు సమీపంగా ఉన్నప్పుడు నేను నా నోరు మూసుకొంటాను.*
2 మాట్లాడుటకు నేను తిరస్కరించాను.
నేనేమి చెప్పలేదు.
కానీ నేను నిజంగా తల్లడిల్లిపోయాను.
3 నాకు కోపం వచ్చింది.
దీని విషయం నేను తలంచిన కొలది నాకు మరింత కోపం వచ్చింది.
కనుక నేను ఏదో అన్నాను.
4 యెహోవా, నాకు ఏమి జరుగుతుందో చెప్పుము.
నేను ఎన్నాళ్లు జీవిస్తానో నాకు చెప్పుము.
నిజానికి నా జీవితం ఎంత కొద్దిపాటిదో నాకు చెప్పుము.
5 యెహోవా నీవు నాకు కొద్దికాలం జీవితం మాత్రమే ఇచ్చావు.
నా జీవితం నీ ఎదుట శూన్యం.
ప్రతి మనిషి యొక్క జీవితం ఒక మేఘంలాంటిది మాత్రమే. ఏ మనిషి శాశ్వతంగా జీవించడు.
6 మేము జీవించే జీవితం అద్దంలోని ప్రతిబంబిం వంటిది.
మా ప్రయాసలన్నియు వ్యర్థము. మేము సామగ్రి సమకూర్చుకొంటూనే ఉంటాము.
కానీ ఆ సామగ్రి ఎవరికి దొరుకుతుందో మాకు తెలియదు.
7 కనుక ప్రభూ, నాకు ఏమి ఆశ ఉంది?
నీవే నా ఆశ.
8 యెహోవా, నేను చేసిన చెడు కార్యాలనుండి నీవు నన్ను రక్షిస్తావు.
దేవునియందు నమ్మకము లేనివానిలా, వెర్రివాడిలా నన్ను యితరులు చూడకుండా నీవు చేస్తావు.
9 నేను నా నోరు తెరవను.
నేను ఏమీ చెప్పను.
యెహోవా, నీవు చేయవలసింది చేశావు.
10 దేవా, నన్ను శిక్షించటం మానివేయుము.
నీ శిక్షవల్ల నేను అలసిపోయాను.
11 యెహోవా, తప్పు చేసిన వారిని నీవు శిక్షించుము. ప్రజలు జీవించాల్సిన సరైన విధానాన్ని నీవు అలా నేర్పిస్తావు.
వారికి ప్రియమైన దాన్ని చిమ్మటవలె నీవు నాశనం చేస్తావు.
మా జీవితాలు అంతలోనే మాయమయ్యే మేఘంలా ఉన్నాయి.
12 యెహోవా, నా ప్రార్థన ఆలకించుము.
నేను నీకు మొరపెట్టే మాటలు వినుము.
నా కన్నీళ్లు తెలియనట్లు ఉండవద్దు.
నేను దాటిపోతున్న ఒక అతిథిని.
నా పూర్వీకులందరిలాగే నేను కూడా ఒక బాటసారిని.
13 యెహోవా, నా వైపు చూడకుము. నేను చనిపోక ముందు నన్ను సంతోషంగా ఉండనిమ్ము.
కొంచెంకాలంలో నేను ఉండకుండా పోతాను.