4
సంగీత నాయకునికి. తంతి వాద్యాలతో పాడదగిన దావీదు కీర్తన.
1 నా మంచి దేవా, నేను నిన్ను ప్రార్థించినప్పుడు నాకు జవాబు ఇమ్ము.
నా ప్రార్థన ఆలకించి, నా యెడల దయ చూపించుము!
ఎప్పుడైనా నాకు కష్టాలు వస్తే, వాటిని తొలగించుము.*
2 ప్రజలారా, ఎన్నాళ్లు మీరు నన్నుగూర్చి చెడ్డమాటలు చెబుతారు?
ప్రజలారా, మీరు నన్ను గూర్చి చెప్పుటకు కొత్త అబద్ధాలకోసం చూస్తూనే ఉంటారు. అలాంటి అబద్ధాలు చెప్పటం అంటే మీకు ఇష్టం.
3 యెహోవా తన మంచి ప్రజల మొర వింటాడని మీకు తెలుసు.
నేను యెహోవాను ప్రార్థించినప్పుడు, ఆయన నా ప్రార్థన వింటాడు.
4 మిమ్ములను ఏదైనా ఇబ్బంది పెడుతుంటే, అప్పుడు కోప్పడవచ్చు.
కాని పాపం చేయవద్దు. మీరు పడకకు వెళ్లినప్పుడు ఆ విషయాలను గూర్చి ఆలోచించండి, అప్పుడు విశ్రాంతి తీసుకోండి.
5 దేవునికి మంచి బలులు అర్పించండి.
మరి యెహోవాయందు విశ్వాసం ఉంచండి.
6 “దేవుని మంచితనాన్ని మనకు ఎవరు చూపిస్తారు?
యెహోవా! ప్రకాశించే నీ ముఖాన్ని మమ్ముల్ని చూడనిమ్ము.” అని చాలామంది ప్రజలు అంటారు.
7 యెహోవా, నీవు నన్ను చాలా సంతోషపెట్టావు. ధాన్యం, ద్రాక్షారసం మాకు విస్తారంగా ఉన్నందు చేత పంట కోత సమయంలో సంబరపడే దాని కంటే ఇప్పుడు మేము ఎక్కువ సంతోషంగా ఉన్నాము.
8 నేను పడకకు వెళ్లి, ప్రశాంతంగా నిద్రపోతాను.
ఎందుకంటె యెహోవా, నీవే నన్ను భద్రంగా నిద్ర పుచ్చుతావు గనుక.