మీకాయా రాజైన అహాబును హెచ్చిరించటం
18
1 యెహోషాపాతుకు ఎక్కువగా ధనం, గౌరవం లభించాయి. రాజైన అహాబుతో అతడు వివాహం* ద్వారా ఒక ఒడంబడిక ఏర్పరచుకొన్నాడు.
2 కొద్ది సంవత్సరాల తరువాత యెహోషాపాతు సమరయ (షోమ్రోను) లో అహాబును చూడటానికి వెళ్లాడు. యెహోషాపాతు, అతని పరివారం యొక్క గౌరవార్థం అహాబు అనేక గొర్రెలను, ఆవులను కోయించాడు. ఆ సమయాన రామోత్గిలాదు పట్టణంపై దాడి చేయటానికి అహాబు యెహోషాపాతును ప్రోత్సహించాడు.
3 “రామోత్గిలాదుపై దండెత్తటానికి నీవు నాతో వస్తావా?” అని అహాబు యెహోషాపాతును అడిగాడు. అహాబు ఇశ్రాయేలు రాజు. యెహోషాపాతు యుదా రాజు అహాబుకు యెషాపాతు యిలా సమాధాన మిచ్చాడు: “నేను నీవంటి వాడను. నా మనుష్యులు నీ మనుష్యుల వంటి వారు. మేము యుద్ధానికి నీతో వస్తాము.
4 కాని ముందుగా మనం యెహోవా వర్తమానం ఏమైనా వుంటుందేమో చూద్దాం,” అని కూడ యెహోషాపాతు అన్నాడు.
5 అందువల్ల అహాబు నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిపించాడు. అహాబు వారితో, “మేము రామోత్గిలాదు పట్టణం మీదికి యుద్ధానికి వెళ్లవచ్చా? లేదా?” అని అన్నాడు.
అప్పుడు ప్రవక్తలు, “వెళ్లండి; ఎందువల్లనంటే దేవుడు రామోత్గిలాదును మీరు ఓడించేలా చేస్తాడు” అని అహాబుకు సమాధాన మిచ్చారు.
6 కాని యెహోషాపాతు యిలా అన్నాడు: “ఇక్కడ యెహోవా యొక్క ప్రవక్త ఎవరైనా వున్నారా? యెహోవా ప్రవక్తలలో ఒకని ద్వారా ఆయన ఏమి చెపున్నాడో తెలుసుకోవలసిన అవసరం వుంది.”
7 అప్పుడు రాజైన అహాబు యెహోషాపాతుతో యీలా అన్నాడు: “ఇక్కడ ఇంకా ఒక మనిషి వున్నాడు. మనం అతని ద్వారా యెహోవాను అడుగుదాం. కాని ఈ మనిషిని నేను అసహ్యించుకుంటాను. ఎందువల్ల నంటే అతడు యెహోవా నుండి నాకు ఒక్క మంచి వర్తమానం కూడ అందచేయడు. నాకు ఎప్పుడూ చెడువార్తలే తెస్తాడు. ఆ వ్యక్తి పేరు మీకాయా. అతడు ఇమ్లా కుమారుడు.”
కాని యెహోషాపాతు, “అహాబూ నీవు అలా అనరాదు” అని అన్నాడు.
8 అప్పుడు రాజైన అహాబు తన అధికారులలో ఒకనిని పిలిచి, “ఇమ్లా కుమారుడైన మీకాయాను త్వరగా తీసుకొని రమ్మని పంపాడు.”
9 ఇశ్రాయేలు రాజైన అహాబు, యూదా రాజైన యెహోషాపాతు తమతమ రాజదుస్తులు ధరించారు. వారిద్దరు సమరయ (షోమ్రోను) నగర ముఖద్వారం దగ్గర వున్న నూర్పిడి కళ్లం వద్ద తమతమ సింహాసనాలపై కూర్చున్నారు. అక్కడకు వచ్చియున్న నాలుగువందల మంది ప్రవక్తలు రాగల సంగతుల వర్తమానాలను రాజుల ముంగిట చెప్తున్నారు.
10 కెనయనా కుమారుని పేరు సిద్కియా. సిద్కియా కొన్ని ఇనుప కొమ్ములు చేయించుకు వచ్చాడు. సిద్కియా యిలా అన్నాడు: “యెహోవా ఈ రకంగా చెప్పుచున్నాడు: ‘నీవు ఈ ఇనుప కొమ్ములు విని యెగించి, అరామీయులు (సిరియనులు) నశించిపోయే వరకు వారిని పోడుస్తావు.’”
11 ప్రవక్తలంతా అదే విషయం చెప్పారు. వారిలా అన్నారు: “రామోత్గిలాదు పట్టణానికి వెళ్లు. నీకు విజయం చేకూరుతుంది. రాజు అరాము ప్రజలను ఓడించేలా యెహోవా తోడ్పడుతాడు.”
12 మీకాయాను పిలవటానికి వెళ్లిన దూత అతనితో యీలా చెప్పాడు: “మీకాయా, వినండి; ప్రవక్తలంతా ఒకే రీతిగా ప్రవచిస్తున్నారు. రాజుకు విజయం చేకూరుతుందని వారు చెప్తున్నారు. వారు చెప్పినట్లుగానే నీవు కూడా తెలియజేయి. నీవు కూడ మంచి విషయాలే చెప్పు.”
13 “యెహోవా జీవముతోడు నేను నా దేవుడు తెలియజేసిన రీతినే చెపుతాను” అని మీకాయా అన్నాడు.
14 పిమ్మట మీకాయా రాజైన అహాబు వద్దకు వచ్చాడు. రాజు అతనితో, “మీకాయా, మేము రామోత్గిలాదు పట్టణంపై దండెత్తటానికి వెళ్లవచ్చునో, లోదో తెలియజేయి” అని అన్నాడు.
అందుకు మీకాయా, “వెళ్లి దాడి చేయి, దేవుడు నీవాప్రజలను ఓడించేలా చేస్తాడు,” అని చెప్పాడు.
15 అహాబు రాజు మీకాయాతో, “గతంలో చాలా సార్లు నిజమే ప్రవచించేలా యెహోవా పేర నీచేత ప్రమాణం చేయించాను,” అని అన్నాడు.
16 అప్పుడు మీకాయా యీలా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలంతా పర్వతాలపై చిందరవందరై పోయినట్లు నేను చూశాను. వారు కాపరిలేని గొర్రెల్లా వున్నారు. యెహోవా చెప్పినదేమంటే, ‘వారికి నాయకుడు లేడు. కావున ప్రతి ఒక్కడినీ క్షేమంగా ఇంటికి పోనిమ్ము.’”
17 అది విని ఇశ్రాయేలు రాజు అహాబు యెహోషాపాతుతో యిలా అన్నాడు: “మీకాయా నాకు ఎప్పుడూ యెహోవా నుండి మంచి వార్త తేడని నేను నీకు ముందే చెప్పాను! నా గురించి అతడు తెచ్చేవన్నీ చెడు వర్తమానాలే!”
18 మీకాయా ఇంకా యిలా అన్నాడు: “యెహోవా వర్తమానాన్ని వినండి! యెహోవా తన సింహాసనంపై కూర్చుని వున్నట్లు నేను చూశాను. పరమండల సైన్యమంతా ఆయన చుట్టూ చేరివుంది.
19 యెహోవా, ‘ఇశ్రాయేలు రాజైన అహాబు అక్కడ చంపబడే విధంగా, యుక్తిగా రామోత్గిలాదుపై అతనిని యుద్ధానికి ఎవరు పంపగలరు?’ అని అడిగినాడు. ఆయన చుట్టూ చేరిన పలువురు పలురకాలుగా చెప్పారు.
20 పిమ్మట ఒక ఆత్మవచ్చి యెహోవా ముందు నిలబడి, ‘అహాబును నేను మోసపుచ్చుతాను’ అని అన్నది. ‘ఎలా?’ అని యెహోవా ఆత్మని అడిగాడు.
21 ‘నేను అసత్యలాడే ఆత్మగా మారి అహాబు ప్రవక్తలలో ప్రవేశించి వారి నోట అబద్ధాలు పలికిస్తాను’ అని ఆత్మ చెప్పింది. అది విని ‘అహాబును మోసగించటంలో నీకు జయమగు గాక! నీవు బయటకు వెళ్లి కార్యము సాధించు’ అని యెహోవా అన్నాడు.
22 “అహాబూ, ఇప్పుడు చూడు; యెహోవా ఒక అసత్య ఆత్మను నీ ప్రవక్తలలో ప్రవేశపెట్టాడు. నీకు కీడు మూడుతుందని యెహోవా చెప్పియున్నాడు.”
23 పిమ్మట సిద్కియా తిన్నగా మీకాయా వద్దకు వెళ్లి చెంపమీద చాచికొట్టాడు. సిద్కియా తండ్రి పేరు కెనయనా. సిద్కియా యిలా అన్నాడు: “మీకాయా, యెహోవా వద్దనుండి వచ్చిన ఆత్మ నన్ను వదిలి నిన్నావరించటానికి ఎటునుండి వచ్చింది?”
24 దానికి మీకాయా “సిద్కియా, నీవు లోపలి గదిలోకి పోయి దాగుకొనే రోజున నీవది తెలుసుకొంటావు!” అని సమాధానమిచ్చాడు.
25 పిమ్మట రాజైన అహాబు యిలా అన్నాడు: “మీకాయాను తీసుకొని వెళ్లి నగరపాలకుడైన ఆమోనుకు, రాజకుమారుడైన యెవాషుకు అప్పజెప్పండి.
26 రాజాజ్ఞగా ఆమోనుకు, యెవాషుకు యిలా చెప్పండి: ‘మీకాయాను చెరసాలలో పెట్టండి. నేను యుద్ధం నుండి తిరిగి వచ్చేవరకు అతనికి రొట్టె నీరు తప్ప ఇతర ఆహారమేదీ యివ్వవద్దు.’”
27 మీకాయా యిలా సమాధానమిచ్చాడు: “అహాబూ, నీవు యుద్ధాన్నుండి క్షేమంగా తిరిగి వస్తే, యెహోవా నా ద్వారా మాట్లాడి యుండలేదని అర్థం. ఓ ప్రజలారా, నా మాటలు విని జ్ఞాపకం పెట్టుకోండి!”
రామోత్గిలాదులో అహాబు చంపబడటం
28 పిమ్మట ఇశ్రాయేలు రాజైన అహాబు, యూదా రాజైన యెహోషాపాతు రామోత్గిలాదు పట్టణాన్ని ముట్టడించారు.
29 అహాబు యెహోషాపాతుతో, “యుద్ధంలోకి వెళ్లే ముందు నేను నా వేషం మార్చివేస్తాను. కాని నీవు మాత్రం నీ రాజదుస్తులే ధరించు” అని అన్నాడు. ఇశ్రాయేలు రాజు మారువేషం వేసిన పిమ్మట రాజులిద్దరూ యుద్ధానికి వెళ్లారు.
30 అరాము (సిరియా) రాజు తన రథాల అధిపతులకు ఒక ఆజ్ఞ యిచ్చాడు. అతడు వారితో యిలా అన్నాడు: “ఎంత గొప్ప వాడేగాని, ఎంత సామాన్యుడే గాని, మీరు ఎవ్వరితోనూ పోరాడవద్దు. కాని మీరు ఇశ్రాయేలు రాజైన అహాబతోనే యుద్ధం చేయండి.”
31 రథాధిపతులు యెహోషాపాతును చూచినప్పుడు అతడే ఇశ్రాయేలు రాజైన అహాబు అనుకున్నారు! అతన్ని ఎదిరించటానికి వారు యెహోషాపాతు మీదికి తిరిగారు. కాని యెహోషాపాతు కేకలు పెట్టటంతో యెహోవా అతనికి సహాయపడ్డాడు. రథాధిపతులు యెహోషాపాతును వదిలి పోయేలాగు దేవుడు వారి మనస్సు మార్చాడు.
32 వారు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజు కాదని తెలిసికొన్నప్పుడు వారతనిని తరమటం మానివేశారు.
33 కాని ఒక సైనికుడు దేనికీ గురిపెట్టకుండా ఒక బాణాన్ని మామూలుగా వదిలాడు. కాని ఆ బాణం ఇశ్రాయేలు రాజైన అహాబుకు తగిలింది. కవచం కప్పకుండా వున్న అతని శరీర భాగంలో ఆ బాణం తగిలింది. అప్పుడు అహాబు తన రథసారధితో, “రథాన్ని వెనుకకు తిప్పి నన్ను యుద్ధరంగం నుండి బయటకు తీసుకొని వెళ్లు. నేను గాయపడ్డాను.” అని చెప్పాడు.
34 ఆ రోజు యుద్ధం తీవ్రంగా జరిగింది. అహాబు తన రథంలో ఆనుకొని సాయంత్రంమయ్యే వరకు అరామీయులను (సిరియనులు) చూస్తూ నిలబడివున్నాడు. సూర్యుడు అస్తమించే సమయంలో అహాబు చనిపోయాడు.
* 18:1: యెహోషాపాతు … వివాహం యెహోషాపాతు కుమారుడు యెహోరాము అహాబు కుమార్తె అతల్యాను వివాహమాడినాడు. చూడండి 2 దిన 21:6.