హిజ్కియా పస్కా పండుగ ఆచరించుట
30
1 రాజైన హజ్కియా ఇశ్రాయేలు, యూదా ప్రజలందరికీ వర్తమానం పంపించాడు. అతడు ఎఫ్రాయిము, మనష్షే* ప్రజలకు కూడా లేఖలు వ్రాశాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పస్కా† పండుగ జరిపేందుకు వారిందరినీ యెరూషలేములోని ఆలయానికి రమ్మని హిజ్కియా ఆహ్వానించాడు.
2 పస్కా పండుగ రెండవ నెలలో జరపటానికి అధికారులతోను, యెరూషలేము సమావేశంలోను చర్చించి రాజైన హిజ్కియా నిర్ణయించాడు.
3 పస్కా పండుగను మామూలుగా జరిగే సమయానికి వారు జరుపుకోలేక పోయారు. ఎందువల్లనంటే పవిత్ర సేవా కార్యాక్రమానికి తగినంత మంది యాజకులు సిద్ధం కాలేదు. పైగా ప్రజలందరూ యెరూషలేములో సమావేశం కాలేదు.
4 ఇప్పుడు పండుగ జరిపే తేదీ పట్ల రాజైన హిజ్కియా, సమావేశమైనవారూ సంతృప్తిని వెలిబచ్చారు.
5 పిమ్మట బెయేర్షెబా పట్టణం మొదలు దాను పట్టణం వరకు ఇశ్రాయేలంతటా వారీవిషయమై ప్రకటన చేశారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరుపటానికి ప్రజలంతా యెరూషలేముకు రావాలని వారు చాటించారు. మోషే ధర్మశాస్త్రంలో నిర్దేశించబడిన విధంగా చాలాకాలంగా ఇశ్రాయేలు ప్రజలలో అధిక సంఖ్యాకులు పస్కా పండుగ జరుపలేదు.
6 కావున దూతలు రాజు యొక్క లేఖలను ఇశ్రాయేలు, యూదా ప్రాంతాలన్నిటికీ తీసుకొని వెళ్లారు. ఆలేఖలలో యిలా రాయబడి వుంది:
ఇశ్రాయేలు బిడ్డలారా, అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు (యాకోబు) విధేయులై వున్న దేవుడైన యెహోవా వైపు తిరగండి. అప్పుడు మీలో ఇంకా బతికివున్న వారి వద్దకు, అష్షూరు రాజు బారినుండి తప్పించుకున్న వారి వద్దకు యెహోవా వస్తాడు.
7 మీ తండ్రులవలెను, మీ సొదరులవలెను మీరు ప్రవర్తించకండి. యెహోవా వారి దేవుడు; కాని వారు ఆయనకు వ్యతిరేకులయ్యారు. అందువల్ల ప్రజలు వారిని అసహ్యించుకునేలా, వారు నిందలపాలయ్యేలా యెహోవా చేశాడు. ఇది నిజమని మీ కళ్లతో మీరే స్వయంగా చూడవచ్చు.
8 మీ ముందు తరంవారివలె మీరు మొండిగా ప్రవర్తించకండి. ఇష్ట పూర్వకమైన మీ హృదయాలతో యెహోవాకు విధేయులు కండి. అతి పరిశుద్ధ స్ధలానికి తరలిరండి. అతి పరిశుద్ద స్థలాన్ని యెహోవా శాశ్వతంగా పవిత్ర పర్చాడు. మీ దేవుడైన యెహోవాను కొలవండి. అప్పుడు యెహోవా యొక్క భయంకరమైన కోపం మీనుండి తొలగిపోతుంది.
9 మీరు తిరిగివచ్చి యెహోవాకు విధేయులైతే, బందీలైన మీ బంధువులు, పిల్లలు వారిని చెరబట్టిన శత్రువుల నుండి కనికరం పొందుతారు. మీ బంధువులు, మీ పిల్లలు మళ్లీ ఈ రాజ్యానికి తిరిగి వస్తారు. మీ దేవుడైన యెహోవా దయగలవాడు; కరుణా మూర్తి. మీరాయనను ఆశ్రయిస్తే ఆయన మిమ్మల్ని ఎన్నడూ వదిలిపెట్టడు.
10 వార్తాహరులు ఎఫ్రాయిము, మనష్షే ప్రాంతాలలో ప్రతి పట్టణానికీ వెళ్లారు. వారు సుదూర ప్రాంతమైన జెబూలూనుకు కూడా వెళ్లారు. కాని అక్కడి ప్రజలు వార్త తెచ్చిన వారిని చూసి నవ్వి, హేళనచేశారు.
11 కాని అషేరు, మనష్షే మరియు జెబూలూను ప్రాంతాలలో కొంతమంది మాత్రం తమను తాము తగ్గించుకొని, అణకువతో యెరూషలేముకు వెళ్లారు.
12 యెహోవా తన వాక్కు ద్వారా రాజైన హిజ్కియా మరియు అతని అధికారులు ఇచ్చిన ఆజ్ఞలకు యూదా ప్రజంతా విధేయులై వుండేలా వారి మనస్సులు మార్చాడు.
13 చాలామంది ప్రజలు జట్లు జట్లుగా పులియని రొట్టెల పండుగ‡ జరుపుకోటానికి రెండవ నెలలో యెరూషలేముకు వచ్చారు. ప్రజాసమూహం పెద్దగా వుంది.
14 యెరూషలేములో బూటకపు దేవుళ్ల ఆరాధనకు నిర్మింపబడ్డ బలిపీఠాలన్నిటినీ అక్కడ చేరిన ప్రజలు తొలగించారు. బూటకపు దేవుళ్లకు నిర్మించిన ధూప పీఠాలను కూడా వారు తీసివేశారు. ఆ బలిపీఠాలన్నిటినీ వారు కిద్రోను లోయలో పారవేశారు.
15 పిమ్మట వారు రెండవ నెల పదునాల్గవ తేదీన పస్కా గొర్రెపిల్లను చంపారు. యాజకులు, లేవీయులు సిగ్గుపడి పవిత్ర సేవా కార్యక్రమానికి పరిశుద్ధులై సిద్ధమయ్యారు. యాజకులు, లేవీయులు దహనబలులు ఆలయానికి తీసుకొనివచ్చారు.
16 యెహోవా సేవకుడైన మోషే ధర్మశాస్త్ర ప్రకారం వారంతా ఆలయంలో తమ తమ స్థానాలను ఆక్రమించారు. లేవీయులు బలుల రక్తాన్ని యాజకులకిచ్చారు. ఆ రక్తాన్ని యాజకులు బలిపీఠం మీద చిలికించారు.
17 సమావేశమైన వారిలో శుచియై సేవా కార్యాక్రమానికి సిద్ధం కానివారు అనేకమంది వున్నారు. కావున వారు పస్కా గొర్రెపిల్లలను చంపటానికి అనుమతింపబడలేదు. ఆ కారణంగా లేవీయులు పరిశుద్ధులు కాని వారందరి తరుపునా పస్కా బలులు అర్పించవలసి వచ్చింది. లేవీయులు ప్రతి గొర్రెపిల్లను పవిత్రపర్చి బలికి సిద్ధం చేశారు.
18-19 ఎఫ్రాయిము, మనష్షే, ఇశ్శాఖారు మరియు జెబూలూను ప్రజలలో చాలామంది పస్కా పండుగుకు శాస్త్రీయంగా తమను తాము పవిత్రపర్చుకోలేదు. మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడిన రీతిలో వారు పస్కా పండుగను సక్రమంగా జరుపుకోలేదు. కాని హిజ్కియా వారికొరకు ప్రార్థన చేశాడు. హిజ్కియా యిలా ప్రార్థన చేశాడు: “ప్రభువైన యెహోవా, నీవు మంచివాడవు. ఈ ప్రజలు నిజానికి నిన్ను ఆచారంగా ఆరాధించాలనుకున్నారు. కాని ధర్మశాస్త్రం చెప్పిన రీతిగా వారు తమను తాము పవిత్ర పర్చుకోలేదు. దయచేసి వారిని క్షమించు. నీవు మా పూర్వీకులు విధేయులైయున్న దేవుడివి. అతిపవిత్ర స్థానానికి అర్హమైన రీతిలో ప్రజలెవరైనా తమను తాము పవిత్ర పర్చుకొనకపోయినా నీవు వారిని క్షమించ కోరుతున్నాను.”
20 రాజైన హిజ్కియా ప్రార్థన యెహోవా ఆలకించాడు. ఆయన ప్రజలను క్షమించాడు.
21 ఇశ్రాయేలు సంతతివారు యెరూషలేములో ఏడు రోజులపాటు పులియని రొట్టెల పండుగను జరుపుకున్నారు. వారంతా చాలా ఆనందోత్సాహాలతో వున్నారు. లేవీయులు, యాజకులు ప్రతిరోజు తమ శక్తి కొలదీ యెహోవాకు స్తోత్రం చేశారు.
22 యెహోవా సేవా కార్యాక్రమంలో పరిపూర్ణ జ్ఞానంగల లేవీయులందరినీ రాజైన హిజ్కియా ప్రోత్సహించాడు. ప్రజలు పండుగను ఏడు రోజులపాటు జరిపి సమాధన బలులు అర్పించారు. వారు తమ పూర్వీకులు ఆరాధించిన ప్రభువైన యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు.
23 ప్రజలంతా అక్కడా మరి ఏడు రోజులు వుండటానికి ఇష్టపడ్డారు. పస్కా పండుగను మరి ఏడు రోజులు జరుపుకున్నందుకు వారు సంతోషించారు.
24 యూదా రాజైన హిజ్కియా ఒక వెయ్యి గిత్తలను, ఏడువేల గొర్రెలను సమావేశమైన ప్రజల ఆహారం నిమిత్తం ఇచ్చాడు. పెద్దలు కూడా వెయ్యిగిత్తలను, పదివేల గొర్రెలను ప్రజలకు ఆహారంగా ఇచ్చారు. చాలామంది యాజకులు పవిత్ర కార్యక్రమానికి సంసిద్ధులయ్యారు.
25 యూదా నుండి వచ్చిన ప్రజా సమూహం, యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలు నుండి వచ్చిన జనం, మరియు ఇశ్రాయేలు నుండి యూదాకు వచ్చిన ఇతర యాత్రీకులు-అందరూ చాలా సంతోషపడ్డారు.
26 అందువల్ల యెరూషలేములో ఆనందం వెల్లివిరిసింది. దావీదు కుమారుడు, ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను కాలం తరువాత ఇప్పటివరకు ఇంత వైభవంగా ఏ ఉత్సవం నిర్వహింపబడలేదు.
27 యాజకులు, లేవీయులు లేచి నిలబడి ప్రజలను దీవించుమని యెహోవాను ప్రార్థించారు. దేవుడు వారి ప్రార్థన విన్నాడు. వారి ప్రార్థన యెహోవా పరిశుద్ధ నివాసం చేరింది.
* 30:1: ఎఫ్రాయిము, మనష్షే ఎఫ్రాయిము, మనష్షేలిరువురూ యోసేపు కుమారులు, వారిద్దరి కుటుంబాలు తరువాత ఇశ్రాయేలు వంశంగా రూపొందాయి. రాజ్య విభజన జరిగినప్పుడు ఎఫ్రాయిము, మనష్షేలు కొంతకాలం పూర్తి ఇశ్రాయేలు రాజ్యంగా, యూదా రాజ్యనికి విడిగా పరిగణింపబడ్డారు.
† 30:1: పస్కా పస్కా యూదులకు ఒక ముఖ్యమైన పండుగ. మోషే కాలంలో వారిని బానిసత్వంనుండి యెహోవా విముక్తి చేసినందుకు జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం ఈ రోజున వారు ప్రత్యేక విందు జరుపుకుంటారు. దీనిని పులియని రొట్టెల పండుగ అని కూడ అంటారు.
‡ 30:13: పులియని … పండుగ దీనినే పస్కా పండుగా అంటారు. ఈ పండుగలో చేసే రొట్టెల పిండిలో ఈస్టు పదార్థం కలిపి పులియ బెట్టరు. ఈస్టు కలిపిన రొట్టెలు కాల్చేటప్పు బాగాపొంగుతాయి. ఇశ్రాయేలీయులు ఈజిప్టు వదిలి పెట్టేటప్పుడు (దాటి పోవు సమయం) స్త్రీలు పిండిని పులియ బెట్టటానికి సమయమే దొరకలేదు. అందువల్ల పులియని రొట్టల పండుగయని పిలుస్తారు.