గొల్యాతు ఇశ్రాయేలీయులను యుద్ధానికి పిలుచుట
17
1 ఫిలిష్తీయులు వారి సైన్యాన్ని యుద్ధానికి సమీకరించారు. వారు యూదాలో శోకో అనేచోట సమావేశమయ్యారు. వారి శిబిరం ఏ ఫెస్దమ్మీము అనే పట్టణం వద్ద పెట్టారు. ఏఫెస్దమ్మీము అనే పట్టణం శోకోకు, అజేకాకు మధ్యగా వుంది.
2 సౌలు, మరియు ఇశ్రాయేలు సైన్యాలుకూడా సమావేశం అయ్యారు. ఏలా లోయలో వారి శిబిరం ఉంది. ఫిలిష్తీయులతో యుద్ధానికి సౌలు సైన్యం తయారయ్యింది.
3 ఫిలిష్తీయులు ఒక కొండమీద ఉన్నారు, ఇశ్రాయేలీయులు మరో కొండమీద ఉన్నారు. ఈ రెండు కొండల మధ్య లోయ ఉంది.
4 ఫిలిష్తీయులకు ఒక ప్రఖ్యాత వీరుడు ఉన్నాడు. వానిపేరు గొల్యాతు. వాడు గాతుకు చెందినవాడు. అతని ఎత్తు తొమ్మిది అడుగుల* కంటె ఎక్కువ. గొల్యాతు ఫిలిష్తీయుల శిబిరంలో నుంచి బయటికి వచ్చాడు.
5 అతని తలమీద ఒక కంచుటోపీ ఉంది. కంచుతో చేసిన చేప పొలుసులవంటి కవచం అతడు ధరించాడు. ఈ కవచం కంచుతో చెయబడి నూట ఇరవై అయిదు పౌన్ల బరువు ఉంది.
6 గిల్యాతు కాళ్లకు రాగి కవచాలు ఉన్నాయి. కంచు ఈటె† ఒకటి అతని మెడమీద కట్టబడి వుంది.
7 గొల్యాతు ఈటెకువున్న కర్రపిడి సాలెవాని మగ్గం వద్దవుండే దోనెలాగా వుంది. ఈటెకత్తి బరువు పది హేను “పౌన్లు.”‡ గొల్యాతు డాలు మోసే భటుడు అతనికి ముందుగా నడిచాడు.
8 గొల్యాతు బయటకు వచ్చి ఇశ్రాయేలు సైనికులకు కేకవేసాడు: “మీ సైనికులు అందురూ యూద్ధానికి బారులు తీసారు ఎందుకు? మీరు సౌలు సేవకులు. నేను ఫిలిష్తీవాడిని. కనుక మీరు ఒకనిని ఎంపిక చేసుకొని నాతో పోరాడేందుకు వానిని పంపించండి.
9 వాడు గనుక నన్ను చంపితే ఫిలిష్తీయులందరు మీ సేవకులవుతారు. కానీ నేను గెలిచి మీవాడిని చంపితే, మీరంతా మాకు సేవకులు అవుతారు. అప్పుడు మీరు మాకు సేవ చేస్తారు!” అన్నాడు అతను.
10 “ఈ రోజు నేనిలా నిలబడి ఇశ్రాయేలు సైన్యాన్ని ఎగతాళి చేస్తున్నాను! నాతో పోరాడటానికీ మీలో ఒకనిని పంపండి” అనికూడ ఆ ఫిలిష్తీయుడు అన్నాడు.
11 గొల్యాతు చెప్పిన వాటిని సౌలు, ఇశ్రాయేలు సైనికులు విన్నారు. వారు చాలా భయపడ్డారు.
దావీదు యుద్ధ భూమికి వచ్చుట
12 ఎఫాయుడైన యెష్షయి కుమారుడు దావీదు. యూదాలో ఉన్న బేత్లెహేముకు చెందినవాడు యెష్షయి. అతనికి ఎనమండుగురు కుమారులు. సౌలు కాలంలో యెష్షయి వృద్ధుడు.
13 యెష్షయి. యొక్క ముగ్గురు పెద్ద కుమారులు సౌలుతోపాటు యుద్ధానికి వెళ్లారు. పెద్ద కుమారుడు ఏలీయాబు. రెండవ కుమారుడు అబీనాదాబు. మూడవ కుమారుడు షమ్మా.
14 దావీదు అందరికంటె చిన్న కుమారుడు. పెద్ద కుమారులు ముగ్గురూ సౌలు సైన్యంలో ఉన్నారు.
15 కానీ దావీదు బేత్లెహేములోని తన తండ్రి గొర్రెలను కాసేందుకు అప్పుడప్పుడూ సౌలును వదిలి వెళ్లేవాడు.
16 ఫిలిష్తీయుడైన గొల్యాతు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం బయటికి వచ్చి ఇశ్రాయేలు సైన్యం ఎదుట నిలబడేవాడు. ఇలా నలుబది రోజులు ఇశ్రాయేలీయులను గొల్యాతు ఎగతాళి చేసాడు.
17 ఒక రోజు యెష్షయి తన కుమారుడైన దావీదుతో ఇలా చెప్పాడు: “యుద్ధాల శిబిరంలో ఉన్న నీ అన్నలకు తూమెడు వేయించిన గోధుమలు, ఈ పది రొట్టెలు తీసుకుని వెళ్లు.
18 ఈ పది జున్ను ముక్కలు కూడ తీసుకుని వెళ్లి నీ సోదరులున్న వేయి మందిగల పటాలం అధికారికీ ఇయ్యి. నీ సోదరులు ఎలా వున్నారో తెలుసుకొని, వారి యోగక్షేమాలకు గుర్తుగా ఏదైనా తిరిగి తీసుకునిరా.
19 నీ సోదరులంతా ఇప్పుడు సౌలుతోనూ, ఇశ్రాయేలు సైన్యంతోనూ కలిసి ఏలా లోయలో ఉన్నారు. వారు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నారు.”
20 దావీదు తెల్లవారు ఝామునే లేచి మరో కాపరికి మందను అప్పగించాడు. ఆహారపు మూటను తీసుకుని యెష్షయి చెప్పిన విధంగా బయలుదేరి వెళ్లాడు. దావీదు తన బండిని శిబిరం యొద్దకు తోలుకెళ్లాడు. దావీదు అక్కడికి వచ్చేటప్పటికి, సైనికులు వారి వారి యుద్ధ స్థావరాలకు వెళ్లుచూ ఉన్నారు. సైనికులు యుద్ధ నినాదాలు చేయటం మొదలుబెట్టారు.
21 ఇశ్రాయేలీయులు, ఫిలిష్తీయులు వారి వారి మనుష్యులను యుద్ధంలో సంధించటానికి సమీకరిస్తున్నారు.
22 ఆహార పదార్థాల అజమాయిషీ వహించే వ్యక్తివద్ద దావీదు తను తెచ్చిన ఆహార పదార్థాలను వుంచి, ఇశ్రాయేలు సైనికులు ఉన్న చోటికి పరుగెత్తాడు. తన సోదరులను గూర్చి దావీదు అడిగాడు.
23 దావీదు తన సోదరులతో సంభాషించటం మొదలుబెట్టాడు. అదే సమయానికి ఫిలిష్తీయుల పోరాట వీరుడు గాతీయుడైన గొల్యాతు ఫిలిష్తీ సైన్యంనుండి బయటకు వచ్చాడు. గొల్యాతు ఇశ్రాయేలీయులను మామూలు గానే కవ్వించే కేకలు వేసాడు. ఇది దావీదు విన్నాడు.
24 గొల్యాతును చూడగానే ఇశ్రాయేలు సైనికులు పారిపోయారు. అతడంటే వారందరికీ భయము.
25 ఇశ్రాయేలు మనుష్యుల్లో ఒకడు ఇలా అన్నాడు: “వాడిని మీరు చూసారా? చూడండి వానిని. గొల్యాతు మాటిమాటికీ బయటికి వచ్చి ఇశ్రాయేలీయులను ఎగతాళి చేస్తున్నాడు. వానిని చంపినవానికి రాజు పుష్కలంగా డబ్బుఇస్తాడు. కనుక గొల్యాతును చంపినవాడు ధనవంతుడైపోతాడు; గొల్యాతును చంపినవానికి సౌలు తన కుమార్తెను కూడ ఇచ్చి వివాహము చేస్తాడు. ఇశ్రాయేలులో వాని కుటుంబాన్ని సౌలు స్వేచ్ఛగా ఉండనిస్తాడు.”
26 తన దగ్గర నిలబడిన మనుష్యులను దావీదు అడిగాడు, “ఈ ఫిలిష్తీవానిని చంపి ఇశ్రాయేలులో ఈ పరాభవాన్ని తొలగించిన వానికి బహుమానం ఏమిటి? ఇంతకూ ఈ గొల్యాతు ఎవడు? వాడు సున్నతి సంస్కారం కూడా లేనివాడు! వాడు కేవలం ఒక ఫిలిష్తీయుడే. జీవిస్తున్న దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే అధికారం వానికి ఉందని వాడు ఎలా అనుకుంటున్నాడు?”
27 కనుక ఆ ఇశ్రాయేలువాడు, గొల్యాతును చంపినందుకు లభించే బహుమానం గూర్చి దావీదుకు చెప్పాడు.
28 దావీదు సైనికులతో మాట్లాడుతుండగా అతని పెద్ద అన్న ఏలీయాబు విన్నాడు. దావీదు మీద ఏలీయాబుకు కోపం వచ్చింది. “అసలు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఉన్న కొన్ని గొర్రెలను అరణ్యంలో ఎవరి దగ్గర వదిలి పెట్టావు? నాకు తెలుసు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావో! చేయుమని చెప్పింది, చేయటం నీకు ఇష్టం లేదు. యుద్ధం చూడటానికే ఇక్కడికి రావాలనుకున్నావు” అంటూ ఏలీయాబు దావీదును నిలదీసాడు.
29 “ఇంతకూ నేనేం చేసాను? నేనేమి తప్పు చేయలేదే! నేను ఊరికే మాట్లాడుతున్నాను” అన్నాడు దావీదు.
30 దావీదు ఇంకొందరి వైపు తిరిగి మళ్లీ అవే ప్రశ్నలు వేశాడు. వారు కూడ ఇంతకు ముందు చెప్పిన సమాధానలే దావీదుకు చెప్పారు.
31 దావీదు పలికినది అంతా కొందరు సౌలుతో చెప్పారు. దావీదును తన దగ్గరకు తీసుకుని రమ్మని సౌలు వాళ్లకు ఆజ్ఞాపించాడు.
32 దావీదు, “ఎవ్వరినీ నిరుత్సాహ పడనియ్యవద్దు. నేను మీ సేవకుడిని. నేను వెళ్లి ఈ ఫిలిష్తీ వానితో పోరాడుతాను” అని సౌలుతో చెప్పాడు.
33 సౌలు, “నీవు ఈ ఫిలిష్తీ గొల్యాతును ఎదిరించి పోరాడలేవు. నీవు కనీసం ఒక సైనికుడివి కూడ కాదు. గొల్యాతు చిన్నప్పటి నుండీ యుద్ధంలో ఆరితేరిన వాడు” అని జవాబిచ్చాడు.
34 అయితే, “నీ సేవకుడనగు నేను నా తండ్రి గొర్రెలను కాపలా కాస్తూ ఉండేవాడిని. ఎప్పుడైనా ఒక సింహంగాని, ఎలుగు బంటిగాని నా మంద మీది కొచ్చి ఒక గొర్రెను పట్టుకుంటే,
35 దానిని నేను తరిమి కొట్టేవాడిని. ఆ అడవి మృగాన్ని నేను ఎదిరించి, దాని నోటినుండి గొర్రెను రక్షించేవాడిని. ఒకవేళ అదే నా మీదికి వస్తే, దాని జూలు పట్టి దానితో పోరాడి, దాన్ని చంపేసేవాడిని.
36 నేను ఒక సింహాన్ని, ఒక ఎలుగుబంటినీ చంపేసాను. అదే విధంగా సున్నతి సంస్కారం లేని ఆ పరాయి ఫిలిష్తీయుడిని నేను చంపేస్తాను. జీవిస్తున్న దేవుని సైన్యాన్ని గొల్యాతు ఎగతాళి చేసాడు గనుక వాడు చస్తాడు.
37 యెహోవా నన్ను సింహంనుండి, ఎలుగుబంటినుండి కాపాడాడు. ఇప్పుడు ఈ ఫిలిష్తీయుడైన గొల్యాతునుండి కూడ ఆ యెహోవాయే నన్ను రక్షిస్తాడు” అని దావీదు సౌలుతో చెప్పాడు.
“అయితే వెళ్లు. యెహోవా నీకు తోడైయుండునుగాక!” అని దావీదుతో చెప్పాడు సౌలు.
38 సౌలు తన స్వంత వస్త్రాలను దావీదుకు ధరింపజేసాడు. దావీదు తలమీద ఒక కంచు శిరస్త్రాణం (టోపి), అతని వంటిమీద ఒక కవచం సౌలు పెట్టించాడు.
39 దావీదు ఒక కత్తి ధరించి అటు ఇటు నడవటానికి ప్రయత్నించాడు. సౌలు యుద్ధ వస్త్రాలను దావీదు ధరించటానికి ప్రయత్నించాడు. కానీ ఈ బరువులన్నీ ధరించటం దావీదుకు అలవాటు లేదు.
అప్పుడు దావీదు, “ఇవన్నీ వేసుకుని నేను పోరాడలేను. వీటన్నిటికీ నేను అలవాటు పడలేదు,” అని సౌలుతో చెప్పి వాటన్నింటినీ విడిచి వేశాడు.
40 దావీదు తన చేతికర్ర తీసుకున్నాడు. లోయలో ఉన్న మంచి నునుపైన రాళ్లను ఐదింటిని దావీదు ఏరుకొన్నాడు. ఆ అయిదు రాళ్లను తన సంచిలో వేసుకున్నాడు. తన చేతిలో వడిసెలు పుచ్చుకొన్నాడు. అప్పుడు ఫిలిష్తీయుడైన గొల్యాతును ఎదురించేందుకు అతడు వెళ్లాడు.
దావీదు గొల్యాతును చంపుట
41 ఫిలిష్తీయుడైన గొల్యాతు నెమ్మదిగా నడుస్తూ దావీదుకు సమీపంగా వస్తున్నాడు. గొల్యాతు కవచంమోసే సహాయకుడు వానికి ముందుగా నడుస్తున్నాడు.
42 గొల్యాతు దావీదును చూచి నవ్వసాగాడు. దావీదు ఒక సైనికుడు కూడ కానట్టు గొల్యాతు చూసాడు. దావీదు కేవలం ఎర్రని ముఖంగల ఒక అందగాడు మాత్రమే.
43 గొల్యాతు దావీదు వైపు చూసి, “నేనేమైనా కుక్కని అనుకున్నావా కర్ర పట్టుకొని వచ్చావు!” అని ఎగతాళి చేశాడు. గొల్యాతు తన దేవుళ్ల పేర్లన్నీ ఉచ్చరిస్తూ దావీదును శపించాడు.
44 “ఇటు రారా! నీ శవాన్ని పక్షులకు, జంతువులకు ఆహారంగా వేస్తాను” అంటూ దావీదు మీద కేకలు వేసాడు గొల్యాతు.
45 “నీవు కత్తి, కవచం, ఈటెలు ధరించి నా దగ్గరకు వస్తున్నావు. కానీ నేను ఇశ్రాయేలు సైన్యాలకు దేవుడు, సర్వశక్తి మంతుడైన యెహోవా పేరిట నీ దగ్గరకు వస్తున్నాను. ఆయనపై నీవు నిందా వాక్యాలు పలికావు.
46 ఈ రోజు ఆ యెహోవా, నాచేత నిన్ను ఓడిస్తాడు. నిన్ను నేను చంపేస్తాను. ఈ వేళ నేను నీ తల నరికి నీ శవాన్ని పక్షులకు, అడవి జంతువులకు ఆహారంగా వేస్తాను. మిగిలిన ఫిలిష్తీయులందరికీ అలానే చేస్తాము. అప్పుడు ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని ప్రపంచం అంతా తెలుసుకొంటుంది.
47 ప్రజలను రక్షించాలంటే యోహోవాకు కత్తులు, కటారులు అక్కరలేదని ఇక్కడున్నవారంతా తెలుసుకొంటారు. ఈ యుద్ధం యెహోవాదే! మీ ఫిలిష్తీయులందరినీ ఓడించేలా యెహోవా మాకు సహాయం చేస్తాడు” అని దావీదు ఫిలిష్తీయుడైన గొల్యాతుతో చెప్పాడు.
48 ఫిలిష్తీయుడైన గొల్యాతు దావీదు మీద పడటానికి మెల్లగా దగ్గరగా వెళ్లాడు. దావీదు గొల్యాతును ఎదుర్కోటానికి వేగంగా పరుగెత్తాడు.
49 దావీదు తన సంచిలో నుంచి ఒక రాయి తీసి వడిసెలలో పెట్టి దానిని విసరికొట్టాడు. ఆ రాయి వడిసెల నుండి వెళ్లి గొల్యాతునుదుటి మీద గట్టిగా తగిలింది. ఆ రాయి అతని తలలోనికి లోతుగా దూసుకుపోయింది. గొల్యాతు ఒక్క సారిగా నేలమీద బోర్ల పడిపోయాడు.
50 అలా దావీదు ఫిలిష్తీయుల యోధుణ్ణి కేవలం ఒక రాయి, వడిసెలతోనే ఓడించేసాడు. ఒక్క దెబ్బతో వానిని చంపేసాడు. దానదు చేతిలో కనిసు కత్తికూడ లేదు.
51 కనుక దావీదు పరుగున పోయి పడివున్న గొల్యాతు పక్కన నిలబడ్డాడు. తరువాత దావీదు గొల్యాతు ఒరలోవున్న కత్తిని లాగి దానితోనే గొల్యాతు తలను నరికివేశాడు. అలా దావీదు ఫిలిష్తీయుల వీరుని హతమార్చాడు.
ఎప్పుడయితే తమ వీరుడు చావటం మిగతా ఫిలిష్తీయులు చూసారో అప్పుడు వెనుదిరిగి పారిపోయారు.
52 ఇశ్రాయేలు, యూదా సైనికులు జయజయధ్వనులు చేస్తూ ఫిలిష్తీయుల సైనికులను గాతు నగర సరిహద్దుల వరకు, ఎక్రోను నగర ద్వారం వరకు తరిమి తరమి కొట్టారు. చాలామంది ఫిలిష్తీయులను వారు చంపేసారు. వారి శవాలు షరాయిము బాటపైగాతు, ఎక్రోనుల వరకు అంత దూరమూ పడివున్నాయి.
53 ఫిలిష్తీయుల సైన్యాన్ని వెళ్లగొట్టి వచ్చి, ఇశ్రాయేలు సైనికులు ఫిలిష్తీయుల గుడారాల నుంచి చాలా వస్తు సంపదను తీసుకున్నారు.
54 గొల్యాతు తలను దావీదు యెరూషలేముకు తీసుకుని వెళ్లాడు. ఆ ఫిలిష్తీయుల యోధుని ఆయుధాలను కూడా దావీదు తన గుడారములో పెట్టాడు.
దావీదును గూర్చి సౌలుకు భయం ప్రారంభం
55 దావీదు ధైర్యంగా గొల్యాతును ఎదుర్కొన్న తీరును సౌలు గమనించాడు. తన సేనాని అబ్నేరును పిలిచి, “ఆ కుర్రవాని తండ్రి ఎవరని” అడిగాడు.
“మీ తోడు అతనెవరో నాకు తెలియదు రాజా” అన్నాడు అబ్నేరు.
56 సౌలు, “ఆ కుర్రవాని తండ్రి ఎవరో తెలుసుకో” అన్నాడు.
57 గొల్యాతును చంపి దావీదు తిరిగి రాగానే అబ్నేరు అతనిని సౌలువద్దకు తీసుకుని వచ్చాడు. దావీదు ఇంకా ఆ ఫిలిష్తీయుని తలను చేతిలో పట్టుకొని ఉన్నాడు.
58 “చిన్నవాడా! నీ తండ్రి ఎవరు?” అని సౌలు అతన్ని అడిగాడు.
“బేత్లెహేములో ఉన్న మీ సేవకుడు యెష్షయి కుమారుడను నేను” అని దావీదు జవాబు చెప్పాడు.
* 17:4: తొమ్మిది అడుగులు అంటే సామాన్య పరిభాషలో నాలుగు మూరల జానెడు అని అర్థం. ప్రాచీన గ్రీకు అనువాదం ప్రకారం ఒక హెబ్రీ చేతివ్రాత ప్రతి ప్రకారం ఈ లెక్క అనుసరించబడింది. చాలా హెబ్రీ పుస్తకాలలో ఆరుమూరల జానెడు అని, తొమ్మిది అడుగుల నాలుగు అంగుళాలని వుంది.
† 17:6: కంచు ఈటె తేలికపాటి చిన్న రకపు కత్తి అనికూడా కొన్ని ప్రతులలో వుంది.
‡ 17:7: పౌన్లు హెబ్రీ భాషలో 600 షెకెలులని అర్థం.