దావీదు విషయంలో అహీతోపెలు సలబహా
17
1 అహీతోపెలు అబ్షాలోముతో ఇంకా యిలా అన్నాడు: “ఇప్పుడు నన్ను పన్నెండు వేలమంది సైనికులను ఎంపిక చేసుకోనీయ్యి. ఈ రాత్రికి నేను దావీదును వెంటాడతాను.
2 అతడు బాగా అలసిపోయి బలహీన పడ్డాక నేనతనిని పట్టుకుంటాను. అతనిని బెదరగొడతాను. దానితో అతనితో ఉన్న వారంతా పారిపోతారు. నేను రాజైన దావీదును మాత్రమే చంపుతాను.
3 తరువాత ప్రజలందరినీ నేను నీ వద్దకు తీసుకొని వస్తాను. నీవు వెదకుతున్న వ్యక్తి (దావీదు) గనుక చనిపోతే, మిగిలిన ప్రజలంతా శాంతంగా తిరిగి వస్తారు.”
4 ఈ పథకం అబ్షాలోముకు, మిగిలిన ఇశ్రాయేలు నాయకులకు మంచిదనిపించింది.
5 అయినా అబ్షాలోము, “అర్కీయుడైన హూషైని పిలవండి. అతడేమి చెపుతాడో కూడా నేను వినదలిచాను” అని అన్నాడు.
అహీతోపెలు సలహాను హూషై వమ్ము చేయటం
6 అబ్షాలోము వద్దకు హూషై వచ్చాడు. అహీతోపెలు సలహాను హూషైకు అబ్షాలోము వివరించాడు. దానిని అనుసరించవచ్చా? లేదా? తెలియజెప్ప మన్నాడు.
7 హూషై ఈ విధంగా చెప్పాడు, “అహీతోపెలు ఇచ్చిన సలహా ఈ సమయంలో మంచిది కాదు.”
8 నీ తండ్రి, అతని మనుష్యులు చాలా గట్టివారని నీకు తెలుసు. పొలాల్లో తన పిల్లల్ని పొగొట్టుకున్న ఎలుగు బంటివలె వారు మహా కోపంతో వున్నారు. నీ తండ్రి బహు నేర్పరియైన యోధుడు. అతను రాత్రంతా తన మనుష్యులతో కలిసి వుండడు.
9 బహుశః ఈ పాటికి ఆయన ఏ గుహలోనో, మరొక చోటనో దాగి వుండవచ్చు. నీ తండ్రి గనుక నా మనుష్యులను ముందుగా ఎదుర్కొంటే, ప్రజలందరికీ ఆ వార్త తెలిసిపోతుంది. అబ్షాలోము అనుచరులు ఓడి పోతున్నారని వారంతా అనుకుంటారు!
10 సింహాల్లా ధైర్యంగా వుండే నీ మనుష్యులు కూడ చెదరిపోయే అవకాశం వుంది. ఎందువల్లననగా ఇశ్రాయేలీయులంతా నీ తండ్రి బలవంతుడైన యోధుడనీ, ఆయన మనుష్యులు మంచి ధైర్యవంతులనీ ఎరుగుదురు!
11 “నేను చెప్పేదేమంటే ఇప్పుడు నీవు దానునుండి బెయేర్షెబా* వరకు వున్న ఇశ్రాయేలీయులనందరినీ చేరదియ్యి. సముద్ర తీరాన ఇసుక రేణువుల్లా నీ వద్ద అనేక మంది ప్రజలు వుంటారు. అప్పుడు నీకై నీవే యుద్ధానికి వెళ్ల వచ్చు.
12 అతను దాగివున్న చోటులోనే మనం దావీదును పట్టుకోవచ్చు. భూమి మీదకు మంచు పడినట్లు మనం దావీదు మీద పడవచ్చు. దావీదును, అతని మనుష్యులందరినీ మనం చంపవచ్చు. వారిలో ఏ ఒక్కడూ వదిలిపెట్టబడడు.
13 ఒకవేళ దావీదు నగరంలోకి తప్పించుకుంటే, ఇశ్రాయేలీయులంతా తాళ్లు పట్టుకు వస్తారు. ఆ నగరాన్నంతా మనం లోయలోకి లాగి వేద్దాం ఇక ఆ నగరంలో ఒక్క చిన్న రాయి కూడ మిగలదు!”
14 “అర్కీయుడైన హూషై ఇచ్చిన సలహా అహీతోపెలు సలహాకంటె చాలా బాగుందని,” అబ్షాలోము, ఇతర ఇశ్రాయేలీయులంతా అన్నారు. ఇదంతా యెహోవా ఏర్పాటు గావున, వారంతా అలా చెప్పారు. యెహోవా అహీతోపెలు ఇచ్చిన మంచి సలహాను వ్యర్థంచేయ సంకల్పించాడు. ఆ విధంగా అబ్షాలోమును శిక్షింప జూశాడు.
హూషై దావీదుకు ఒక హెచ్చరిక పంపటం
15 హూషై ఈ విషయాలన్నీ యాజకులైన సాదోకు మరియు అబ్యాతారుకు చెప్పాడు. అబ్షాలోముకు, ఇశ్రాయేలు నాయకులకు అహీతోపెలు యిచ్చిన సలహాను కూడ హూషై వారికి చెప్పాడు. అంతే గాకుండా తను ఏ సలహా ఇచ్చినది కూడా సాదోకు, అబ్యాతారులకు హూషై వివరించాడు. హూషై ఇలా అన్నాడు:
16 “త్వరగా దావీదుకు ఒక వర్తమానం పంపండి. ప్రజలు ఎక్కడెక్కడైతే ఎడారిలోకి ప్రవేశిస్తారో ఆయా ప్రాంతాలలో దావీదును ఈ రాత్రికి వుండవద్దని చెప్పండి. కాని యొర్దాను నదిని తక్షణమే దాటి వెళ్లమనండి. వారు నదిని గనుక దాటినట్లయితే రాజు, ఆయన అనుచరులు పట్టుబడరు.”
17 యాజకుల కుమారులైన యోనాతాను మరియు అహిమయస్సు కలిసి ఏన్ రోగేలు దగ్గర వేచివున్నారు. వాళ్లు నగరంలోకి వెళ్తున్నట్లు ఎవరూ చూడ కూడదనుకున్నారు. కావున ఒక పనిపిల్ల వారి వద్దకు వచ్చింది. ఆమె వారికి ఒక సమాచారం అందజేసింది. తరువాత యోనాతాను, అహీమయస్సులు ఇరువురూ రాజైన దావీదు వద్దకు వెళ్లి అన్ని విషయాలూ చెప్పారు.
18 అయినా ఒక బాలుడు యోనాతానును, అహిమయస్సును చూశాడు. వారు అబ్షాలోముకు చెప్పటానికి పరుగున పోయాడు. ఇది గమనించిన యోహనాతాను, అహిమయస్సు వెంటనే పారిపోయారు. వారు బహురీములో ఒకని ఇంటికి వెళ్లారు. ఆ ఇంటివాని ఆవర ణలో† ఒక బావి వున్నది. యోనాతాను, అహిమయస్సు ఆ బావిలోకి దిగారు.
19 ఇంటివాని భార్య బావి మీద ఒక దుప్పటి కప్పి వేసింది. ఆమె మళ్లీ దాని మీద ధాన్యం పోసింది. అప్పుడా బావి ఒక ధాన్యపు రాశిలా కన్పించింది. అందువల్ల యోనాతాను, అహిమయస్సు అందులో దాగి వున్నారని ఎవరూ అనుకోరు.
20 అబ్షాలోము సైనికులు ఆ ఇంటి యజమానురాలి వద్దకు వచ్చి “అహిమయస్సు, యోనాతాను ఎక్కడ వున్నారు?” అని అడిగారు.
“వాళ్లు అప్పుడే వాగు దాటి పోయారని” ఆ స్త్రీ అబ్షాలోము మనుష్యులకు చెప్పింది.
అబ్షాలోము మనుష్యులు యోనాతాను, అహిమయస్సులను వెదుక్కుంటూపోయారు. కాని వారిద్దరినీ వారు కనుగొనలేదు. అందుచే అబ్షాలోము సైనికులు యెరూషలేముకు తిరిగి వెళ్లిపోయారు.
21 అబ్షాలోము మనుష్యులు వెళ్లిపోయిన తరువాత యోనాతాను, అహిమయస్సు బావిలో నుండి బయటికి వచ్చారు. జరిగినదంతా రాజైన దావీదుకు వారు చెప్పారు. వారు దావీదుతో, “త్వరపడండి. నదిని దాటి వెళ్లండి! మీకు వ్యతిరేకంగా అహీతోపెలు ఇవన్నీ చేస్తున్నాడు” అని అన్నారు.
22 వీదు, అతని మనుష్యులు యొర్దాను నదిని దాటి వెళ్లారు. సూర్యోదయానికి ముందే దావీదు, అతని అనుచరులు యొర్దాను నదిని దాటారు.
అహీతోపెలు ఆత్మహత్య చేసుకోవటం
23 ఇశ్రాయేలీయులు తన సలహా పాటించలేదని అహీతోపెలు గమనించాడు. అహీతోపెలు తన గాడిదపై గంతవేసి దానిపై తన నగరానికి వెళ్లాడు. తన కుటుంబపోషణకు తగిన ఏర్పాట్లు చేసి అహీతోపెలు ఉరిపోసుకొని చనిపోయాడు. అహీతోపెలు చనిపోయినాక అతని శవాన్ని అతని తండ్రి సమాధిలో పాతిపెట్టారు.
అబ్షాలోము యొర్దాను నదిని దాటటం
24 దావీదు మహనమయీముకు చేరాడు. అబ్షాలోము, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులు యొర్దాను నదినిదాటారు.
25 అబ్షాలోము తన సైన్యాధి కారిగా అమాశాను నియమించాడు. అంటే యోవాబు స్థానాన్ని అమాశా ఆక్రమించాడు.‡ ఇత్రా అనేవాని కుమారుడు అమాశా. ఇత్రా ఇష్మాయేలీయుడు§ అమాశా తల్లి పేరు అబీగయీలు. ఈమె సెరూయా** సోదరియగు నాహాషు కుమార్తె. (సెరూయా యోవాబు తల్లి)
26 అబ్షాలోము, ఇశ్రాయేలీయులు గిలాదు రాజ్యంలో గుడారాలు వేసుకున్నారు.
షోబీ, మాకీరు, బర్జిల్లయి
27 దావీదు మహనయీముకు చేరాడు. షోబీ, మాకీరు మరియు బర్జిల్లయి అక్కడ వున్నారు. (నాహాషు కుమారుడైన షోబీ అమ్మోనీయుల రాజధానియగు రబ్బాకు చెందినవాడు. అమ్మీయేలు కుమారుడైన మాకీరు లోదెబారుకు చెందినవాడు. బర్జిల్లయి అనువాడు గిలాదులోని రోగెలీము పట్టణవాసి)
28-29 “ఎడారిలోవున్న ప్రజలు అలసిపోయి ఆకలిదప్పులు గొనియున్నారు” అని వారు చెప్పినారు. అందువల్ల దావీదు, అతని మనుష్యులు తినటానికి వారు అనేక పదార్థాలు పట్టుకువచ్చారు. వారు పరుపులు, పాత్రలు, కుండలు తెచ్చారు. వారింకా గోధుమలు, యవలు, పిండి, వేపిన ధాన్యం, కాయగూరలు, ఎండబెట్టిన గింజలు, తేనె, వెన్న, గొర్రెలు, ఆవుపాల మీగడ మొదలైనవన్నీ తెచ్చారు.
* 17:11: దానునుండి బెయేర్షెబా అనగా ఇశ్రాయేలు జనులందరనీ అర్థం. దాను ఇశ్రాయేలుకు ఉత్తర సరిహద్దుల్లోను, బెయేర్షెబా దక్షిణానగల పట్టణాలు.
† 17:18: ఇంటివాని ఆవర ణ ఆ చుట్టు పక్కల చాలా మంది ఇండ్లు నిర్మించుకొని, వంటలు వండుకోవటానికి, పని చేసు కోవటానికి మరియు తినటానికి ఉపయోగించుకొంటారు.
‡ 17:25: యోవాబు … ఆక్రమించాడు యోవాబు ఇంకా దావీదునే బలపరుస్తూ ఉన్నాడు. అబ్షాలోమునుండి దావీదు పారిపోయేనాటికి దావీదు ముగ్గురు సైన్నాధికారులలో యోవాబు ఒకడు. చూడండి సమూయేలు రెండువ గ్రంథం 18:2.
§ 17:25: ఇష్మాయేలియుడు ఒక ప్రాచీన అనువాదంలో ఇష్మాయేలీయుడని వుంది. (మొదటి దినవృత్తాంతములు 2:17) హెబ్రీ గ్రంథంలో ఇశ్రాయేలీయుడని వుంది.
** 17:25: సెరూయా “సెరూయా సోదరియగు నాహాషుకు కుమార్తెయైన అబీగయీలుతో ఇత్రా సంగమించెను” అని పాఠాంతరము.