4
1 “నరపుత్రుడా, ఒక ఇటుక తీసుకొని దానిమీద ఒక బొమ్మ గియ్య. యెరూషలేము నగరపు బొమ్మ వేయుము.
2 నీవా నగరాన్ని ముట్టుడించే సైన్యంలాగా చిత్రీకరించు. నగరాన్ని తేలికగా పట్టుకొనేటందుకు అనువుగా దానిచుట్టూ ఒక మట్టిగోడ నిర్మించు. నగరపు గోడవరకు ఒక మట్టి రహదారి వేయుము. సమ్మెటల్ని (ముఖ్య నాయకుల్ని) తెప్పించి, నగరం చుట్టూ సైనిక స్థావరాలను ఏర్పాటు చేయండి.
3 పిమ్మట ఒక ఇనుప పెనము తీసుకొని దానిని నీకు, నగరానికి మధ్య ఉంచు. అది నిన్ను, నగరాన్ని వేరుచేసే ఇనుప గోడలా ఉంటుంది. ఈ రకంగా నీవా నగరానికి వ్యతిరేకంగా వున్నట్లు నీవు చూపిస్తావు. నీవా నగరాన్ని చుట్టుముట్టి దానిపై దాడి చేస్తున్నట్లు వుంటుంది. ఎందువల్లనంటే ఇశ్రాయేలు వంశానికి ఇది ఒక ఉదాహరణగా వుంటుంది. (దేవుడనైన) నేను యెరూషలేమును నాశనం చేస్తానని అది నిరూపిస్తుంది.
4 “తరువాత నీవు ఎడమ పక్కకి పడుకో, ఇశ్రాయేలీయుల పాపాలన్నీ నీవు భరిస్తున్నట్లు నిరూపించే విధంగా నీవాపని చేయాలి. నీవు ఎడమ పక్కన ఎన్నాళ్లు పడుకొని ఉంటే అన్నాళ్లు నీవా పాపాలను మోస్తావు.
5 నీవు వారి పాపాన్ని మూడు వందల తొంభై రోజులు* భరించాలి. ఈ ప్రకారం ఇశ్రాయేలు ఎంతకాలం శిక్షింపబడుతుందో నేను తెలియజేస్తున్నాను. ఒక్కరోజు ఒక్క సంవత్సరానికి సమానం.
6 “ఆ తరువాత నీవు కుడి పక్కకి తిరిగి నలభై రోజులు పడుకోవాలి. ఈసారి నీవు యూదావారి పాపాలను నలభై రోజులపాటు భరిస్తావు. ఒక రోజు ఒక సంవత్సరానికి సమానం. యూదా ఎంతకాలం శిక్షింపబడాలో నేను నీకు ఈ విధంగా తెలియజేస్తున్నాను.”
7 దేవుడు మళ్లీ మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు, “ఇప్పుడు నీవు నీ చొక్కా చేతిని పైకి మడిచి, ఆ ఇటుక మీదికి నా చేతినెత్తు. యెరూషలేము నగరంపై దాడి చేస్తున్నట్లు నీవు ప్రవర్తించు. నీవు నా తరఫు దూతగా మాట్లాడుతున్నట్లు చూపటానికి ఈ విధంగా చేయుము.
8 ఇప్పుడు చూడు, నిన్నిప్పుడు తాళ్లతో కట్టుతున్నాను. నగరంపై నీ దాడి పూర్తయ్యేవరకు నీవు అటు, ఇటు కదలలేవు.”
9 దేవుడు ఇంకా చెప్పాడు: “రొట్టె చేయటానికి నీవు కొంత ధాన్యాన్ని తీసుకొనిరా. కొన్ని గోధుమలు, బార్లీ బియ్యము (యవలు), చిక్కుడు గింజలు, పప్పులు, జొన్నలు, సజ్జలు తీసుకో. వీటన్నిటినీ కలిపి రోటిలోవేసి దంచి పిండి చేయుము. ఈ పిండిని ఉపయోగించి రొట్టె చేయుము. నీవు పక్కకు తిరిగి పడుకొనే మూడువందల తొంభై రోజులూ ఈ రొట్టెనే తినాలి.
10 రొట్టె ను చేయటానికి ఈ పిండిని రోజుకు ఒక గిన్నెడు (సుమారు ఇరవై తులాలు) మాత్రమే ఉపయోగించటానికి నీకు అనుమతి ఇవ్వబడింది. అవసరమైనప్పుడల్లా రోజంతా ఆ రొట్టెనే నీవు తినాలి.
11 ప్రతి రోజూ మూడు గిన్నెల నీరే నీవు తాగాలి. రోజంతా తగిన సమయానికి దానిని తాగాలి.
12 ప్రతిరోజూ నీ రొట్టెను నీవే చేసుకోవాలి. నీవు మనుష్యుల మలం తెచ్చి, ఎండబెట్టి, దానిని కాల్చాలి. మండే ఆ మనుష్యుల మలం మీద నీవు ఆ రొట్టెను కాల్చాలి. ప్రజల ఎదుట ఈ రొట్టెనే నీవు కాల్చితినాలి.”
13 మళ్లీ యెహోవా ఇలా చెప్పాడు: “ఈ పని చేయటం ద్వారా ఇశ్రాయేలు వంశీయులు పరాయి దేశాలలో అపరిశుభ్రమైన రొట్టెలు† తింటారని నీవు సూచిస్తావు. వారు ఇశ్రాయేలు వదిలి అన్యదేశాలకు పోయేలా నేను వారిని ఒత్తిడి చేశాను!”
14 అప్పుడు నేనిలా (యెహెజ్కేలు) అన్నాను, “అయ్యో, నా ప్రభువైన యెహోవా, నేనెన్నడూ అపరిశుద్ధ ఆహారాన్ని తినలేదు. వ్యాధిచే చచ్చిన జంతు మాంసంగాని, అడవి జంతువుచే చంపబడిన పశువుల మాంసాన్ని గాని నేను ఎన్నడూ తినియుండలేదు. నా చిన్ననాటి నుండి ఈ నాటి వరకు నేను ఎన్నడూ అపరిశుద్ధ ఆహారం ముట్టి ఎరుగను. ఆ దుష్ట మాంసమేదీ నానోట బడలేదు.”
15 అందుకు దేవుడీలా అన్నాడు: “సరే! నీ రొట్టెను కాల్చటానికి ఎండిన ఆవుపేడ ఉపయోగించేటందుకు నీకు అనుమతి ఇస్తున్నాను. ఎండిన మనిషి మలం నీవు వినియోగించనవసరం లేదు.”
16 దేవుడు ఇంకా ఇలా అన్నాడు, “నరపుత్రుడా, యెరూషలేముకు ఆహార పదార్థాల సరఫరాను నిలిపి వేస్తున్నాను. అందువల్ల ప్రజలు తగుమాత్రం రొట్టె తినవలసి వస్తుంది. వారి ఆహార పదార్థాల సరఫరా విషయమై వారు మిక్కిలి చింతిస్తారు. వారికి తాగే నీరు కూడా పరిమితమవుతుంది. ఆ నీటిని తాగినప్పుడు వారు మిక్కిలి భీతిల్లుతారు.
17 ఎందువల్లనంటే ప్రజలకు తినటానికి తిండి, తాగటానికి నీరు తగినంత ఉండదు. ప్రజలు ఒకరిని చూచి ఒకరు భయ కంపితులవుతారు. వారివారి పాపాల కారణంగా వారు చిక్కి శల్యాలైపోతారు.