5
1-2 “నరపుత్రుడా, నీ ఆకలి సమయం* అనంతరం నీవు ఈ పనులు చేయాలి: ఒక పదునైన కత్తి తీసుకో. దానిని మంగలి కత్తిలా వినియోగించి, నీ జుట్టును, గడ్డాన్ని గొరిగివేయుము. అలా తీసిన నీ జుట్టును ఒక తాసులో తూకం వేయుము. ఆ జుట్టును మూడు సమభాగాలుగా తూచాలి. నీ జుట్టులో ఒక భాగాన్ని నగరం బొమ్మ ఉన్న ఇటుక మీద పెట్టి, ఆ జుట్టును నగరంలో కాల్చివేయుము. కొంతమంది ప్రజలు నగరంలో చనిపోతారనే దానికి ఇది ఒక సూచన. ఒక కత్తితో రెండవ భాగం జుట్టును చిన్న చిన్న ముక్కలుగా చేయుము. ఆ జుట్టును నగరం (ఇటుక) చుట్టూ జల్లు. కొంతమంది ప్రజలు నగరం వెలుపల చనిపోతారని ఇది తెలియజేస్తుంది. నీ జుట్టులో మూడవ భాగాన్ని గాలిలోకి విసిరివేయుము. దానిని గాలిలో బహుదూరం కొట్టుకొనిపోనిమ్ము. కొంత మంది ప్రజలను నేను నా కత్తిని బయటికిలాగి బహుదూర దేశాలకు తరిమివేస్తానని ఇది సూచిస్తుంది.
3 కాని తరువాత నీవు వెళ్లి కొట్టుకుపోయిన వెంట్రుకలలో కొన్నింటిని ఏరి తేవాలి. వాటిని నీ దుస్తులతో చుట్టు. ఇది నా ప్రజలలో కొంతమందిని తిరిగి నా వద్దకు తెచ్చుకుంటాననే దానికి సూచన.
4 ఎగిరిపోయిన వెంట్రుకలలో మరికొన్నింటిని ఏరితే. తెచ్చి, వాటిని నిప్పులో వేయుము. ఇది ఇశ్రాయేలు ఇల్లంతా అగ్నికి గురియై నాశనమవుతుందనడానికి ఒక సూచన.”
5 నా ప్రభువైన యెహోవా ఇంకా ఇలా చెప్పియున్నాడు. “ఆ ఇటుకరాయి యెరూషలేముకు గురుతు. యెరూషలేమును ఇతర రాజ్యాలకు మధ్య ఉంచుతాను. దాని చుట్టూ దేశాలుంటాయి.
6 ఆ ప్రజలు నా ఆజ్ఞలను ధిక్కరించారు. ఇతర దేశాల వారికంటె వీరు మిక్కిలి హీనులయ్యారు. వారిచుట్టూ వున్న దేశాల ప్రజలకంటె ఈ ప్రజలే నా ధర్మాన్ని ఎక్కువగా ఉల్లంఘించారు. నా ఆజ్ఞలను వినటానికి వారు నిరాకరించారు! నా నియమాలను వారు మన్నించ లేదు!”
7 కావున నా ప్రభువైన యెహోవా ఇలా అన్నాడు: “మీకు నేను భయంకర పరిస్థితులు కల్పిస్తారు. ఎందు కనగా మీరు నా ధర్మాన్ని అంగీకరించి, అనుసరించలేదు. మీరు నా ఆజ్ఞలను పాటించలేదు. మీ చుట్టూవున్న ప్రజలకంటే నా న్యాయసూత్రాలను మీరే ఎక్కువగా ఉల్లంఘించారు! ఆ ప్రజలు తప్పుగా భావించే పనులను కూడా మీరు చేశారు!”
8 అందువల్ల నా ప్రభువైన యెహోవా చెప్పినదేమంటే, “కాబట్టి ఇప్పుడు, నేను కూడా మీకు వ్యతిరేకిని. ఇతర ప్రజలంతా చూసేలా నేను మిమ్ముల్ని శిక్షిస్తాను.
9 గతంలో నేనెన్నడూ చేయని పనులు మీకు నేను చేస్తాను. ఆ భయంకరమైన శిక్షను ఇకముందెన్నడూ విధించను! ఎందువల్లనంటే మీరు అనేక భయంకరమైన పనులు చెశారు.
10 యెరూషలేము ప్రజలు చాలా ఆకలితో ఉండి, తండ్రులు వారి బిడ్డలనే తినివేస్తారు. పిల్లలు వారి తండ్రులను తినివేస్తారు. అనేక విధాలుగా మిమ్ముల్ని నేను శిక్షిస్తాను. చావగా మిగిలిన ప్రజలను నేను అన్ని దిక్కులలో చిందర వందరగా వదిలి వేస్తాను.”
11 నా ప్రభువైన యెహోనా ఇలా చెప్పాడు, “యెరూషలేమా, నా జీవము తోడుగా నిన్ను నేను శిక్షిస్తానని చెపుతున్నాను! నిన్ను శిక్షిస్తానని నేను ప్రమాణ పూర్వకంగా చెపుతున్నాను! ఎందుకంటే, నా పవిత్ర స్థలానికి నీవు భయంకరమైన పనులు చేశావు. దానిని అపవిత్ర పర్చుతూ ఘోరమైన పనులు చేశావు! నేను నిన్ను శిక్షిస్తాను. నీ పట్ల కరుణ ఏ మాత్రం చూపించను. నిన్ను చూచి నేను విచారపడను!
12 నగరంలో నీ ప్రజలలో మూడవ వంతు వ్యాధిపీడితులై ఆకలితో చనిపోతారు. నీ ప్రజలలో మూడవ వంతు నగరం వెలుపల యుద్ధంలో చనిపోతారు. అప్పుడు నా కత్తిని బయటికిలాగి మీలో మరొక మూడో వంతు మందిని దూర దేశాలకు తరిమి వేస్తాను. నీ చుట్టూ ఉన్న ప్రజలు యుద్ధంలో వారిని చంపివేస్తారు! అప్పుడు మాత్రమే నేను నీ పట్ల నా కోపాన్ని ఉప సంహరించుకుంటాను.
13 అప్పుడు మాత్రమే నీ ప్రజల పట్ల నా కోపాన్ని తగ్గించుకుంటాను. వారు నా పట్ల చేసిన పాపకార్యాలకే వారు శిక్షింపబడ్డారని నాకు తెలుసు. నేను వారి యెహోవానని వారప్పుడు తెలుసుకుంటారు. వారి పట్ల నాకుగల గాఢమైన ప్రేమ† వల్ల నేను వారితో మాట్లాడానని కూడా వారు తెలుసు కుంటారు!”
14 దేవుడు ఇలా చెప్పాడు: “యెరూషలేమా, నిన్ను నేను నాశనం చేస్తాను. నీవు కేవలం ఒక రాళ్ల కుప్పలా మిగిలిపోతావు. నీ చుట్టూ వున్న ప్రజలు నిన్ను ఎగతాళి చేస్తారు. నీ పక్కగా వెళ్లే ప్రతివాడూ నిన్ను చూచి పరిహసిస్తాడు.
15 నీ చుట్టూ వున్న ప్రజలు నిన్ను పరిహసిస్తారు. కాని వారికి నీవొక గుణపాఠంలా కూడ మిగులుతావు. నేను నీ పట్ల కోపగించి, నిన్ను శిక్షించినట్లు వారు చూస్తారు, నేను మిక్కిలి కోపంగా ఉన్నాను. నేను నిన్ను హెచ్చరించాను. యెహోవానైన నేను ఏమి చేస్తానో నీకు చెప్పాను!
16 నీకు లభించే ఆహరాన్ని తీసేసి మరల మరల ఆకలిగొలిపే ఆ సమయాన్ని కలుగజేస్తానని చెప్పియున్నాను. నిన్ను నాశనం చేసే భయంకర పరిణామాలు కలుగజేస్తానని నీకు చెప్పియున్నాను. ఆ కరువు పరిస్థితులు అనేకసార్లు వచ్చాయి. మీకు ఆహార పదార్థాలు సరఫరా కాకుండా చేశాను.
17 నేను ఆకలిని, క్రూరమృగాలను నీ మీదను పంపుతాను. ఆవి నీ పిల్లలను చంపుతాయి. నగరమంతా వ్యాధులు, మరణాలు సంభవిస్తాయని నేను చెప్పియున్నాను. మీ మీదికి శత్రు సైన్యాలను తెప్పించి యుద్ధం చేయిస్తాను. యహోవానగు నేను ఈ విషయాలన్నీ సంభవిస్తాయని నీకు చెప్పియున్నాను. అవన్నీ జరిగి తీరాయి!”